బందిపోరాలో ఎన్ కౌంటర్ ఒక ఉగ్రవాది హతం
మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు డ్రోన్ కెమెరాల ద్వారా మృతదేహం గుర్తింపు అరగాం అడవులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ బందిపోరాలో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదానికి మట్టుబెట్టాయి. ఆదివారం నుంచి అరగాం అడవుల్లో కాల్పుల శబ్ధాలు వినిపిస్తున్నాయన్న సమాచారం మేరకు భద్రతాదళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం ఉదయం ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఆ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు తీవ్రతరం చేశామన్నారు. అయితే భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు వారిపైకి కాల్పులకు దిగారు. పలువురు సైనికులు తృటిలో తప్పించుకొని ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కాగా మృతి చెందిన ఉగ్రవాది మృతదేహాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆ ప్రాంతంలోనే మరింత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాలను చుట్టుముట్టారు. రియాసీ యాత్రికులపై ఉగ్రదాడి ఘటనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా మూడు రోజులుగా ఉగ్రవాదుల కట్టడికి కేంద్ర హోంశాఖ సమావేశాలు కొనసాగిస్తున్న సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని బలగాలను తరలించాలని నిర్ణయించింది. దీంతోపాటు బ్లూప్రింట్ ను సిద్ధం చేసింది. దాని ట్రయల్ రన్ ను కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయితే ఇక సరిహద్దులు, జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, వారికి సహాయం చేసే వారిని సమూలంగా కేంద్రం నిర్మూలించనుంది.