బలమైన ఉనికిని చాటుకున్నారు
మహిళా, యువశక్తికి మోదీ కృతజ్ఞతలు ఎగ్జిట్ పోల్ విడుదల అనంతరం ప్రధాని ట్వీట్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎగ్జిట్ పోల్ తో మహిళా, యువ శక్తి, నిరుపేదలు బీజేపీ వైపే ఉన్నారనేది తేలిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటు ద్వారా వారు మరోమారు తమ బలమైన ఉనికిని చాటుకున్నారని కొనియాడారు. శనివారం ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలైన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్టర్ ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రజాస్వామ్యంలో తనను మరోసారి ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. తన విజ్ఞప్తిని మన్నించి వారు ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ మార్పును చాలామేరకు తీసుకువచ్చామన్నారు. రానున్న సమయంలో మరిన్ని సంస్కరణలు చేపడతామని తెలిపారు. ప్రజాస్వామ్య తీర్పుతోనే భారత్ ను అతి పెద్ద ఐదో ఆర్థిక దేశంగా నిలబెట్టడంలో విజయం సాధించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన, అందించబోతున్న పథకాలు దేశంలోని అర్హులకందరికీ చేరాలన్నదే తమ ముఖ్యోద్దేశ్యమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.