అరుణాచల్ లో కమల వికాసం
మరోమారు సీఎం పదవిపై ఫెమా?
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో కమలం పార్టీ హావా కొనసాగిస్తోంది. 60 అసెంబ్లీ స్థానాలలో ఆదివారం ఉదయం నుంచి లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 17 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా, 37స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవకపోవడం గమనార్హం. 2019లో బీజేపీ 42 స్థానాలతో అరుణాచల్ లో విజయం సాధించింది. ఈసారి సుమారుగా 50కు పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించనుంది. కాగా ఎన్ పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) 5, ఇతరులు 8 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఫెమా ఖాండూ..
అరుణాచల్ బీజేపీ సీఎం ఫెమా ఖాండూ కొనసాగుతున్నారు. మరోమారు ఆయన్నే సీఎంగా కొనసాగనున్నారు. ఈయన తండ్రి దోర్జీ ఖండూ. అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం. ఫెమా ఖండూ తొలిసారిగా 2016లో సీఎం పదవిని చేపట్టారు. అప్పుడు ఫెమా కాంగ్రెస్ పార్టీలో ఉండడం విశేషం. అనంతర పరిణామాల్లో బీజేపీలో చేరారు. పలు మంత్రి పదవులను కూడా నిర్వహించారు.
ఇటానగర్ లోని బీజేపీ పార్టీ ఆఫీసులో సంబురాలు మొదలయ్యాయి. బ్యాండు మేళం, రంగులు చల్లుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ నాయకులు బిజీబిజీగా సంతోషంగా డ్యాన్సులు చేస్తూ కనిపించారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ విజయంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజూ కీలక పాత్ర పోషించారు.
సిక్కింలో ఎస్ కేఎం హావా..
మరోవైపు సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారం కోసం 17 సీట్లు గెలుపొందాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎస్ కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) 11 స్థానాల్లో గెలుపొందగా మరో 20 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎస్డీఎఫ్ (సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్) 1 స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లు ఖాతా తెరవలేదు.
ప్రేమ్ సింగ్ తమాంగ్..
ఎస్ కేఎం పార్టీని 2013 ఫిబ్రవరి 4న స్థాపించారు. పార్టీ స్థాపనలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ప్రేమ్ సింగ్ తమాంగ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో సిక్కిం సీఎం పదవిని చేపట్టారు. సిక్కింలో ఎస్ కేఎం పార్టీ విజయం ఖాయమే కావడంతో మరోమారు ప్రేమ్ సింగ్ తమాంగ్ సీఎం పదవిని చేపట్టనున్నారు.
ఈ రెండు ప్రాంతాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. రెండు ప్రాంతాల్లోనూ హస్తం పార్టీకి తిరస్కరణే ఎదురైంది. కమలం పార్టీ ఒక రాష్ర్టంలో అధికారం చేపట్టబోతోంది.