పసిడి ప్రియులకు షాక్
ధరలు పైపైకి నాలుగు నెలల్లోనే 9వేలకు పెరిగిన బంగారం ధరలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మగువలు మెచ్చే పసిడి (బంగారం) ధరలు పైపైకెగసిపడుతున్నాయి. మార్కెట్ లో మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ. 72,336కు చేరుకుంది. వెండి ధర రూ.92,522 (కిలో)కు చేరుకోవడం గమనార్హం.
నాలుగైదు నెలలుగా బంగారం ధరలను పరిశీలిస్తే 2024 జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ. 63,352 ఉండగా, వెండి కిలో రూ. రూ.63,352 ధరలు పలికాయి. కేవలం నాలుగు నెలల కాలంలోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో పెళ్లిళ్లు, పేరాంటాల్లో బంగారాన్ని కొనేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఉన్నత వర్గాలు ఎలాగైనా కొనుగోళ్లకు ముందుకు వస్తాయన్నది తెలిసిందే. కానీ మధ్యతరగతి, పేద వర్గాలకే బంగారం ధర దడ పుట్టిస్తోంది.
బంగారంతో రూపొందించిన నగలు నట్రా కొనడంలో భారత్ ముందువరుసలో ఉంటుదన్నది తెలిసిందే. ప్రపంచంలోనే మొదటి స్థానంలో బంగారాన్ని కొనడం, అమ్మకాలు, వినియోగంలో భారత్ ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు వ్యాపార వర్గాలు ఈ ఏడాది మొదట్లోనే భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి బ్లాక్ చేశారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు బంగారం దిగుమతులు తగ్గడం కూడా డిమాండ్ ఏర్పడేందుకు కారణమని దీంతోనే ధరలు పెరిగాయని పేర్కొంటున్నారు. వ్యాపార వర్గాలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ వాటిని బ్లాక్ చేసి ధరలు పెరిగాక కొద్దికొద్దిగా బయటకు తీసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలే భారత్ లో పలు ఐటీ దాడుల్లో ఈ విషయం కూడా స్పష్టమైన విషయం తెలిసిందే.