జేఎంఎం, కాంగ్రెస్ అవినీతి ఆనకొండలు
రాష్ట్రపతి ని ఓడించేందుకు వీరితోపాటు ఇండీ జమాత్ ప్రయత్నం శుక్రవారం సెలవు దినమా? ఝార్ఖండ్ ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ
రాంచీ: దోపిడీ, దోపిడీ, దోపిడీతో జేఎంఎం, కాంగ్రెస్ ఝార్ఖండ్ లో అవినీతి ఆనకొండలను మించి పోయాయని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. తాను టీవీల్లో రూ. 35 కోట్లు, రూ. 300 కోట్లు, రూ. 19 కోట్లు నోట్ల కట్టలను చూస్తూ విస్తుపోయానని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన ఆడబిడ్డను ఓడించేందుకు వీరిద్దరితో కలిసి ఇండీ జమాత్ ప్రయత్నించిందని మండిపడ్డారు. లవ్ జిహాద్ తొలుత ఝార్ఖండ్ లో వెలుగు చూసిందన్నారు. ఇక్కడ ఓ జిల్లాలో నైతే ఆదివారం సెలవును రద్దు చేసి శుక్రవారం సెలవుదినంగా పాటించేవారన్నారు. జూన్ 4 బీజేపీ విజయం తరువాత అవినీతి ఆనకొండలపై తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఏ శక్తులను ఉపేక్షించబోమని తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు.
మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఝార్ఖండ్ లోని దుమ్కా ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.
వెయ్యి కోట్ల కుంభకోణం..
ఝార్ఖండ్ లోని అపారమైన ఖనిజ సంపదను ఈ పార్టీలు దోచుకుతిని అవినీతి సొమ్మును వెనకేసుకుంటున్నాయని తెలిపారు. గిరిజనులు, దళితుల భూములను మభ్యపెట్టి లాక్కుంటున్నాయన్నారు. సాహిబ్ గంజ్ లో వెయ్యి కోట్ల విలువైన కుంభకోణం వెలుగులోకొచ్చిందన్నారు. ఈ సొమ్మంతా నిరుపేదలదన్నారు. నిరుపేదల తింటున్న తిండిగింజలను సైతం దోచుకుతింటున్న వారు వీరని మండిపడ్డారు. నిరుపేద వర్గాల కోసం ఉచిత రేషన్ ను అందిస్తే బ్లాక్ మార్కెట్ ల ద్వారా సొమ్ముచేసుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ కుంభకోణంపై అసలు ఎలాంటి చర్యలు కూడా ఈ రాష్ర్ట ప్రభుత్వం తీసుకోలేదని గుర్తు చేశారు.
అవినీతిపై ఉక్కుపాదం..
కానీ మోదీ వచ్చాక వీరి ఆటలు సాగడం లేదన్నారు. మోదీ అంటే వీరికి సింహాస్వప్నమన్నారు. అందుకే తనపై విమర్శలు, ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కానీ తాము ఈ ప్రాంత సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ నే కేటాయించామన్నారు. ఏకలవ్య పాఠశాలలు, లార్డ్ బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. ఆదివాసీ చరిత్రను చాటి చెప్పే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నక్సలిజానికి కాంగ్రెస్ కారణం..
నిరుపేదలను నక్సలిజం ముసుగులోకి నెట్టివేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. బీజేపీ వచ్చాక అభివృద్ధిని చూసి పలువురు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారన్నారు. నక్సలిజంలో చేరిన పిల్లల తల్లిదండ్రుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ఝార్ఖండ్ లో గిరిజనులు, ఆదివాసీలు, స్థానికుల సంఖ్య వేగంగా తగ్గుతూ చొరబాటుదారుల సంఖ్య పెరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. వేర్పాటువాదులను రక్షించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పార్టీలు పెట్టుకున్నాయన్నారు. వీరికి రిజర్వేషన్లు కూడా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తాను జీవించి ఉన్నంత కాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవ్వరూ లాక్కోలేరని మోదీ స్పష్టం చేశారు.
అభివృద్ధి దిశలో ఝార్ఖండ్..
మోదీ హాయంలో ఝార్ఖండ్ లో అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన జరిగిందన్నారు. విమానాశ్రయం, జాతీయ రహదారులు, బ్రిడ్జిలు, రైల్వే టెర్మినళ్లు, లాజిస్టిక్ పార్కులు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ఝార్ఖండ్ లోని నిరుపేదలకు ఆర్థిక చేయూతనిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.