క్లిష్ట సమయాల్లో మాల్దీవులకు సహాయం
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాల్దీవులు మంత్రి మూసా జమీర్ తో పలు విషయాలపై చర్చలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వీలైనంత మేరకు క్లిష్ట సమయాల్లో కూడా మాల్దీవులకు భారత్ చేయగలిగినంతా సహాయాన్ని చేసిందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పేర్కొన్నారు. భారత్-మాల్దీవుల సంబంధాల అభివృద్ధి పరస్పర ప్రయోజనాలు, సున్నితత్వంపై ఆధారపడి ఉంటుందని జై శంకర్ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న మాల్దీవులు విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్ తో గురువారం జై శంకర్ న్యూ ఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మాల్దీవులు సముద్ర ప్రాంతంలో తమ దేశ స్వప్రయోజనాలకు సంబంధించిన ఫైబర్ ఫస్ట్ పాలసీ విషయంలో మంత్రితో చర్చించామన్నారు. ఇరుదేశాల విదేశాంగ ప్రతినిధులు కలిసి మాట్లాడుకోవడం మంచిదన్నారు. సైనికుల తొలగింపు అంశంలో కూడా చర్చలు కొనసాగినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని మంత్రి వెల్లడించలేదు. మొయిజ్జు నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి మూసా పర్యటనతో తిరిగి భారత్ తో స్నేహ సంబంధాలను మాల్దీవులు కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. గతంలో మొయిజ్జు మాట్లాడుతూ భారత్ తమ సైనికులను మాల్దీవులు నుంచి ఉపసంహరించుకోవాలని మే 10 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.