కువైట్​ లో భారీ అగ్నిప్రమాదం 41మంది మృతి

30 మందికి కాలిన గాయాలు.. మృతుల్లో అత్యధికులు భారతీయులు.. బాధితులను పరామర్శించిన భారత రాయబారి ఆదర్శ్​.. విదేశాంగ మంత్రి జై శంకర్​ విచారం కార్మికులకు అండగా ఉంటాం.. భవన యాజమాని అరెస్టుకు కువైట్​ మంత్రి ఆదేశం .. ప్రధాని మోదీ తీవ్ర విచారం

Jun 12, 2024 - 17:21
Jun 12, 2024 - 18:42
 0
కువైట్​ లో భారీ అగ్నిప్రమాదం 41మంది మృతి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కువైట్​ లో భారతీయులు పనిచేస్తున్న లేబర్​ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 41 మంది అక్కడికక్కడే మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది భారతీయులున్నట్లుగా కువైట్​ లోని భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. మంగాఫ్​ లోని బుధవారం ఉదయం ఓ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.  ఆరు అంతస్థుల భవనంలో అంతా కార్మికులే ఉంటున్నట్లుగా స్థానిక పోలీసులు తెలిపారు. వంటగదిలో మంటలు చెలరేగి భవనం మొత్తం వ్యాపించాయన్నారు. అగ్నిప్రమాదానికి పూర్తి కారణాలపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఈ భవనంలో మొత్తం 160 మంది కార్మికులు నివసిస్తున్నారని వారంతా ఒకే సంస్థలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని భారత రాయబారి ఆదర్శ్​ స్వైకా పరామర్శించారు. పూర్తి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉన్నట్లు తెలిపారు. 

అగ్నిప్రమాదంపై విదేశాంగ శాఖ ఎస్​.జైశంకర్​ మాట్లాడుతూ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో భారత్​ కార్మికులకు అండగా ఉంటుందన్నారు.

కాగా అగ్నిప్రమాదంపై మంత్రి షేక్​ ఫహద్​ అల్​ యూసఫ్​ స్పందిస్తూ వెంటనే భవన యాజమానిని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్​ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుంఆ చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రధాని మోదీ విచారం..

కువైట్​ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనను కువైట్​ లోని భారత రాయబార కార్యాలయం నిశితంగా పరిశీలిస్తోందన్నరు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని  ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.