మహా సీఎంగా ఫడ్నవీస్​

సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకారం

Dec 5, 2024 - 13:38
 0
మహా సీఎంగా ఫడ్నవీస్​

హాజరు కానున్న అతిరథ మహారథులు
భద్రత పటిష్ఠం

ముంబాయి: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గురువారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్​ మూడోసారి సీఎం పీఠం అధిష్టించనున్నారు. ముంబాయిలోని ఆజాద్​ మైదానంలో ప్రమాణ స్వీకారానికి ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, వీవీఐపీలు సుమారు రెండువేల మంది హాజరుకానున్నారు. గురువారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్​ ముంబాయిలోని సిద్దివినాయక ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ముంబాదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఓ గోవును కూడా తన ఇంటికి తీసుకువచ్చి పూజించారు. 

దేవేంద్ర ఫడ్నవీస్​ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొని అంచలంచెలుగా ఎదిగారు. 2014 నుంచి 2019 వరకు ఫడ్నవీస్​ తొలిసారి మహారాష్ట్ర సీఎంగా ఎంపికయ్యారు. 2019లో ఎన్సీపీ అజిత్​ పవార్​ సహాయంతో సీఎంగా ఎన్నికయ్యారు. కానీ రెండు రోజులకే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మూడోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. ఏక్​ నాథ్​ షిండే, అజిత్​ పవార్​ లు డిప్యూటీ ఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సహా 2 వేల మంది వీఐపీలను ఆహ్వానించారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో సాయంత్రం 5:30 గంటలకు ఈ వేడుక జరగనుంది. గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి 40 వేల మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆజాద్​ మైదానానికి దారి తీసే అన్ని చోట్ల చెక్​ పోస్టులు ఏర్పాటు చేశారు. రాకపోకలను నిషేధించారు. పార్కింగ్​ కోసం ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రజలకు ప్రత్యేక దారుల ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. అదే సమయంలో ఎన్ ఎస్​ జీ బృందాలు, బాంబు స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​ బృందాలు కూడా భద్రతా చర్యల్లో పాలుపంచుకున్నాయి.