సీఏఏతో 31,313మందికి భారత పౌరసత్వం
స్పష్టం చేసిన పార్లమెంట్జాయింట్కమిటీ. హిందు, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రిస్టియన్ వర్గాలకు లబ్ధి. దరఖాస్తులు నిరంతర ప్రక్రియ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: సీఏఏ పౌరసత్వం కింద పాక్, బంగ్లాదేశ్, అఫ్ఘాన్ నుంచి వచ్చిన వారికి భారత శాశ్వత పౌరసత్వం లభించనుంది. కొత్త చట్టం వల్ల 31,313 మందికి లబ్ధి చేకూరనుందని పార్లమెంట్ జాయింట్కమిటీ నివేదిక స్పష్టం చేసింది. చట్టం ద్వారా హిందు, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రిస్టియన్ వర్గాలకు లబ్ధి కలగనుంది. 2014 కంటే ముందు భారత్కు వచ్చి స్థిరపడ్డ వీరంతా పౌరసత్వానికి అర్హులుగా ప్రభుత్వం ఈ చట్టంలో వెసులుబాటు కల్పించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తన రికార్డుల ప్రకారం 25,447 మంది హిందువులు, 5,807 మంది సిక్కులు, 55 మంది క్రైస్తవులు, ఇద్దరు బౌద్ధులు, ఇద్దరు పార్సీలు తాజా నిబంధనల ప్రకారం భారత పౌరసత్వం పొందడానికి అర్హులని కమిటీకి తెలిపింది. వీరికి ఆయా దేశాల్లో మతపరమైన వేధింపుల నివేదికల ఆధారంగా దీర్ఘకాలిక వీసా మంజూరు ద్వారా భారత పౌరసత్వం అందించాలని కోరుతున్నారు. వీరంతా ఎన్నో యేళ్లుగా భారత్కు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరంతా ముందుగా పౌరసత్వం పొందనున్న వారిలో ఉంటారు. ఐబీ ప్రకారం ఈ కేటగిరీ కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి, ఇతరులు మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వచ్చినట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ రుజువులను రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) సహా భవిష్యత్తులో వీరు చెప్పిన విషయాలపై ఆరా తీసి నిర్ణయం తీసుకుంటారు.
కేవలం 31,313 మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందా?
పార్లమెంటు సంయుక్త కమిటీ అడిగిన ఈ ప్రశ్నకు ఐబీ డైరెక్టర్ గతంలో సమాధానమిస్తూ ప్రస్తుతానికి దరఖాస్తు చేసుకున్న 31, 313 మందిని అర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరితోబాటు భవిష్యత్తులో దరఖాస్తు చేసుకున్న మరింత మందికి కూడా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందన్నారు. తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని అన్నారు. 2017 నుంచి 2021 వరకు మొత్తం 4,844 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు 2022 ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. 2017లో 817 మంది, 2018లో 628 మంది, 2019లో 987 మంది, 2020లో 639 మంది, 2021లో 1,773 మంది విదేశీయులు భారత పౌరసత్వం లభించింది. పౌరసత్వం తీసుకున్న వారిని, వెళ్లిపోయిన వారిని పోల్చి చూస్తే భారత పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. 2020లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య 85,256 అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021లో ఈ సంఖ్య 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.