హైదరాబాద్‌లో ఏఐ సిటీ

మూసీ హైదరాబాద్​ జీవనాడిగా మారుతుంది

Feb 8, 2024 - 15:10
 0
హైదరాబాద్‌లో ఏఐ సిటీ

నా తెలంగాణ, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. తెలంగాణలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనులు చేపడతామని.. ఆ నది మరోసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారుతుందని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటి వరకు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని తెలిపారు. పాలమూరు – -రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్లు!
విద్యతో పాటు ఉద్యోగమూ సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తామని గవర్నర్​ తెలిపారు. 10 నుంచి12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని, హైదరాబాద్‌ను దేశంలోనే ఏఐ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయున్నట్లు పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని ప్రకటించారు. 
ఫిబ్రవరి 10న బడ్జెట్‌
గవర్నర్‌ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. తొమ్మిదో తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. అదే రోజు శాసనసభ కార్యకలాపాల సలహాకమిటీ (బీఏసీ) సమావేశాన్ని నిర్వహించి, సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక శాఖను నిర్వహించే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్‌ సమావేశాలు సుమారు 7- నుంచి10 రోజుల వరకు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
కాళోజీ కవిత
కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు.
‘‘ అధికారమున్నదని హద్దు పద్దు లేక.
అన్యాయమార్గాల నార్జింపబూనిన .
అచ్చి వచ్చే రోజులంతమైనాయి .
అచ్చి వచ్చే రోజులంతమైనాయి!’’ అంటూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
కేసీఆర్ డుమ్మా...
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. అయితే రేపు(శుక్రవారం) ధన్యవాద తీర్మానం చేయడానికి ఆయన హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా గత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు.