కువైట్ అగ్నిప్రమాదం.. సహాయక చర్యల పర్యవేక్షణకు ఆదేశం
విదేశాంగ సహాయ మంత్రికి ప్రధాని ఆదేశాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కువైట్ ప్రమాద ఘటనను పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ వెళ్లాలని ప్రధాని మోదీ ఆదేశించారు. బుధవారం రాత్రి ప్రధాని కార్యాలయం నుంచి సహాయమంత్రికి ఆదేశాలందాయి. అక్కడి భారత విదేశాంగ శాఖ, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారికి మరింత మెరుగైన వైద్యసేవలందించే చర్యలను పర్యవేక్షించాలన్నారు. భారతీయులకు సంబంధించి విదేశాంగ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసింది.
అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉండడం దురదృష్టకరం. కాగా గాయాలైన వారంతా అల్ అడెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం (10 లక్షలు). శ్రామిక శక్తిలో 30 శాతం (సుమారు 9 లక్షలు) మంది పనిచేస్తున్నారు.
కాగా విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా కీర్తివర్ధన్ సింగ్ మంగళవారమే పదవీ బాధ్యతలను చేపట్టారు.