రూ.7.36 లక్షల కోట్లతో భారీ బడ్జెట్
లక్నో: భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన యూపీ ప్రభుత్వం రాష్ర్టాలన్నింటినీ వెనక్కు నెట్టింది. యూపీ అసెంబ్లీలో ఆ రాష్ర్ట బడ్జెట్ ను సోమవారం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో, ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూ. 7,36,437.71 కోట్లతో ప్రవేశపెట్టారు. భారీ బడ్జెట్ కు యూపీ సీఎం కితాబిచ్చారు. రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధికి, శ్రీరాముడికి ఈ బడ్జెట్ ను అంకితమిస్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. రాష్ర్ట ప్రజలపై ఎలాంటి అదనపు భారం వేయకుండా భారీ బడ్జెట్ ను సమర్పించామన్నారు.
రూ. 40 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 2.4 శాతం ఉన్న నిరుద్యోగాన్ని నియంత్రించామని యోగి అన్నారు. శాంతిభద్రతలను బలోపేతం చేయడం వల్ల భవిష్యత్తులో కూడా లక్షలాది ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడి వాతావరణాన్ని రాష్ర్టంలో తీసుకువచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.40 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. దీనివల్ల భారీ ఎత్తున నిరుద్యోగులు,యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని యోగి స్పష్టం చేశారు.
దేశానికి గ్రోత్ ఇంజిన్ యూపీ
యూపీని దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అయితే తాము కూడా అదే దిశలో పనిచేస్తామని యోగి నొక్కి వక్కాణించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడంలో, ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ బడ్జెట్ ఒక మైలురాయిగా నిలుస్తోందని యోగి సంతోషం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ద్వారా వ్యాపార, వాణిజ్య రంగాల్లో గణనీయమైన వృద్ధి చోటు చేసుకోవడం ఖాయమన్నారు. యూపీకి నూతన దారులు తెరుచుకున్నాయని ప్రజలంతా తమతో సహకరిస్తే చాలాన్నారు.
కేటాయింపులు
- హోంశాఖ పరిధిలోని ప్రాసిక్యూషన్ విభాగానికి చెందిన చిత్రకూట్ కార్యాలయానికి రూ.5 కోట్లు.
- లోకాయుక్త కార్యాలయంలో అదనపు అంతస్తులు, అతిథి గృహం నిర్మాణానికి రూ.5 కోట్లు.
- డివిజనల్ హోంగార్డు కార్యాలయం, జిల్లా హోంగార్డు కార్యాలయానికి రూ.20 కోట్లు.
- హోంగార్డుల డివిజన్ శిక్షణ కేంద్రాల నిర్మాణానికి రూ.15 కోట్లు.
- పోలీసు వ్యవస్థ బలోపేతానికి రూ. 755 కోట్లు. వివిధ రకాలైన వాహనాల కొనుగోళ్లకు రూ. 20 కోట్లు, రూ. 5.97 కోట్లు, రూ. 57 లక్షలు.
– అయోధ్య, వారణాసి, చిత్రకూట్, లక్నో, వింధ్యాచల్, ప్రయాగ్‌రాజ్, నైమిశారణ్య, గోరఖ్‌పూర్, మధుర, బటేశ్వర్ ధామ్, గర్ముక్తేశ్వర్, శుక్తిర్థ ధామ్, మా శాకుంభరీ దేవి, సారనాథ్ లలో నిర్వహించే వివిధ రకాల వేడుకల కోసం రూ. 100 కోట్లు, రూ॥ 14.68 కోట్లు, రూ. 11.79 కోట్లు, రూ. 10.53 కోట్లు, రూ. 10 కోట్లను కేటాయించారు.
– రోడ్ల నిర్మాణం, సుందరీకరణ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడంతో అత్యాధునిక బస్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ తదితరాల కోసం భారీ కేటాయింపులు చేశారు.