జ్ఞానవాపీపై విచారణ 15కు వాయిదా
జ్ఞానవాపీ మసీదు బేస్మెంట్ లో ఏఎస్ఐ సర్వే డిమాండ్ పై మంగళవారం మరోమారు జిల్లా కోర్టులో విచారణ జరిగింది.
వారణాసి: జ్ఞానవాపీ మసీదు బేస్మెంట్ లో ఏఎస్ఐ సర్వే డిమాండ్ పై మంగళవారం మరోమారు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఇరుపక్షాల వాదనను అడిగి తెలుసుకుంది. అనంతరం కేసు విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.జిల్లా జడ్జి కోర్టులో విచారణ సందర్భంగా ముస్లిం పక్షం ఈ కేసులో అభ్యంతరం వ్యక్తం చేసింది. నేలమాళిగలో సర్వే నిర్వహిస్తే మసీదు దెబ్బతింటుందని కోర్టుకు తెలిపింది. న్యాయవాది సౌరభ్ తివారీ మాట్లాడుతూ ఏఎస్ఐ సర్వే నివేదిక ప్రకారం జ్ఞాన్వాపీలో ఎనిమిది బేస్మెంట్లు ఉన్నాయన్నారు. వీటిలో ఎస్-1, ఎన్-1 బేస్మెంట్లు సర్వే చేయలేదన్నారు. ఈ రెండు సెల్లార్లలోకి వెళ్లే మార్గాన్ని ఇటుకలు, రాళ్లతో మూసి వేశారని కోర్టుకు నివేదించారు. జ్ఞానవాపీలో కనిపించే నేలమాళిగలు కాకుండా, ఇతర నేలమాళిగలు ఉనికిలో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేలమాళిగల్లో బావులు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది.