మీ కేఆర్ఎంబీ నాటకాలు ఆపండి
రెండు పార్టీల తీరును అసెంబ్లీలో ఎండగడతాం మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల మండిపాటు
నా తెలంగాణ, హైదరాబాద్: లోకసభ ఎన్నికల ముందు కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేఆర్ఎంబీ పేరుతో నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ రెండు పార్టీల తీరుతోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వరరెడ్డి, రాజాసింగ్, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్ మాట్లాడారు. బీఆర్ఎస్ అవినీతిపై గతంలో సీబీఐ విచారణ కోరిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని విమర్శించారు. 2014 కంటే ముందు కేఆర్ఎంబీ లేదని విభజన బిల్లులో ఈ అంశాన్ని కాంగ్రెస్ చేర్చిందని, అన్ని విషయాలు దగ్గర ఉండి రాపించానని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
రహస్య ఒప్పందాలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీటికి అదనపు వాటాగా వాడుకోవాలని విభజన అంశాల్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ఎన్నికల సమయంలోనే ఇరు పార్టీలు తిట్టుకుంటాయని, రహస్య ఒప్పందాలు బయట పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. ఇరు పార్టీల తీరును అసెంబ్లీలో ఎండగడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ సీబీఐకి ఉత్తరం రాస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ ప్రారంభమవుతుందని, సీబీఐ విచారణ చేస్తే బీఆర్ఎస్ నేతలు పట్టుబడతారని కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్నదని, మోదీ వేవ్ ను సైడ్ ట్రాక్ చేసేందుకే రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలన్నప్పటకీ కేఆర్ఎంబీనే ఎందుకు ప్రస్తావిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.