రక్షణ శాఖకు ‘ఎల్సీఏ మార్క్–1’
మార్చి 31న అందించేందుకు హెచ్ఏఎల్ ఏర్పాట్లు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: హెచ్ఏఎల్ రూపొందించిన ‘ఎల్సీఏ మార్క్–1’ (లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్) తొలి యుద్ధ విమానం మార్చి 31న రక్షణ రంగానికి అందనుందని రక్షణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. 2021న రక్షణ మంత్రిత్వ శాఖతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూ. 48వేల కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 83 తేజస్ మార్క్ విమానాల్లో నూతన టెక్నాలజీతో రూపొందించిన ‘ఎల్సీఏ మార్క్–1’ రక్షణ శాఖకు అందనుంది. ఇప్పటికే ఎల్సీఏ విమానాలు అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుందన్నారు. భారత రక్షణ రక్షణ, వైమానిక రంగం మరింత బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఈ యుద్ధ విమానాలను పాక్ సరిహద్దుకు సమీపంలోని రాజస్థాన్ బికనీర్నల్ ఎయిర్ బేస్ స్టేషన్లో మోహరించనున్నారు. ఇక్కడి నుంచే సరిహద్దు నిఘాను పటిష్ఠం చేయనున్నారని అధికారులు వివరించారు.
‘ఎల్సీఏ మార్క్–1’ యుద్ధ విమానం ప్రత్యేకతలు..
గంటకు 2200 కిమీ వేగం అందుకోగలదు. 739 కి.మీ. దూరం వరకు క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ యుద్ధ విమానం తేజస్ మార్క్–1 కంటే బరువు తక్కువ. 43.4 అడుగుల పొడవు, 14.5 అడుగుల ఎత్తు ఉంటుంది. గరిష్ఠంగా 50వేల అడుగుల ఎత్తులో ఎగరగలదు. ఈ యుద్ధవిమానంలో 23 ఎంఎం డబుల్ బ్యారెల్ ఆటోమెటెడ్గన్ను సమకూర్చారు. తొమ్మిది రకాల క్షిపణులు, రాకెట్లు, బాంబులను మోసుకెళుతూ దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. విమానాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేశారు. డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థతో కూడిన ఆధునాతన కంప్యూటర్ ను ఏర్పాటు చేశారు. స్కాన్, రాడార్, స్వీయ రక్షణ జామర్, వార్ఫేర్లాంటి అన్ని సౌకర్యాలలో అత్యాధునిక సాంకేతికతను అనుసంధానించారు.