భారత విద్యార్థుల వరుస మరణాలు..
అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాల వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ గురువారం మీడియాకు వెల్లడించారు.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాల వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. మరణాలపై మాట్లాడుతూ.. ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మృతిచెందిన ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరే భారత పౌరులున్నారన్నారు. మిగిలిన ముగ్గురు భారత సంతతికి చెందిన అమెరికా పౌరులేనని వివరించారు. డ్రగ్స్‌కు బానిసైన ఇల్లు లేని ఓ వ్యక్తి వివేక్ సైనీ అనే భారత విద్యార్థిని తలపై సుత్తితో దాడి చేయడం వల్ల మృతిచెందిందన్నారు. సిన్సినాటిలో జరిగిన మరో ఘటనలో మరో భారత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని దర్యాప్తు కొనసాగుతుందన్నారు. వీరుగాక భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ ఘటనల్లో మరణించారు. వీరిలో వివేక్ సైనీ హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. విచారణ వేగంగా కొనసాగుతోందని జైస్వాల్ తెలిపారు. సిన్సినాటి ఘటనలో విద్యార్థి మృతికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందన్నారు. భారత విద్యార్థుల మరణాలపై అమెరికాలోని ఆయా ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని, మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తున్నామని రణ్ ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.