దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy should increase domestic coal production
- బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టిపెట్టాలి
- కోల్‌కతాలో జరిగిన సీఐఎల్ సమావేశంలో కిషన్ రెడ్డి సూచన
- సీఐఎల్ ద్వారా జరుగుతున్న పనులకు అభినందన
- హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి
- జీఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నేషనల్ ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ ప్రారంభం
-
కోల్‌కతా : బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తున్నదన్నారు. ఈ విషయంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు శుక్రవారం కోల్‌కతాలో సీఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి అనంతరం ఉద్యోగులు, ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. దేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తున్నదని అభినందించారు. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పించిన లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి పని చేయాలన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. దేశీయ అవసరాలకు కొత్త బ్లాకులను గుర్తిస్తూ.. బొగ్గు ఉత్పత్తిని చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని పిలుపునిచ్చారు.
అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాలి..
అనంతరం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలో కాపర్ ఎక్స్‌ప్లొరేషన్ లో పనిచేస్తున్న ఏకైక సంస్థ అయిన హెచ్ సీఎల్ రానున్న రోజుల్లో దేశీయ అవసరాలకు తగ్గట్లుగా మరింత ఉత్పత్తిని పెంచడంపై పని చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. సంస్థ సాధించిన ప్రగతిని.. రానున్న రోజుల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం జీఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన.. నేషనల్ ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ ను ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో.. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను గుర్తు చేశారు. ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు ముందుగానే వీటిని గుర్తించే విధంగా కేంద్రం పని చేస్తుందన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. సానుకూల ఫలితాలు వచ్చాయని వివరించారు. రానున్న రోజుల్లో ఆధునిక సాంకేతికను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు.