జాకీర్​ ఇక లేరు! ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం

Zakir is no more! Prime Minister Narendra Modi grief

Dec 16, 2024 - 13:55
 0
జాకీర్​ ఇక లేరు! ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం

అమెరికాలో చికిత్స పొందుతూ మృతి
వెల్లడించిన కుటుంబ సభ్యులు

నా తెలంగాణ, న్య ఢిల్లీ: ప్రముఖ తబలా కళాకారుడు జాకీర్​ హుస్సేన్​ (72) ఇకలేరు. గత కొంతకాలంగా ఇడియోపతిక్​ పల్మనరీ ఫైబ్రోసిస్​ తో ఆయన బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆదివారం రాత్రి మృతిచెందినట్లు వార్తలు వెలువడినా కుటుంబ సభ్యులు ఖండించారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు జాకీర్​ హుస్సేన్​ మరణించినట్లు తెలిపారు. అమెరికాలోని శాన్​ ఫ్రాన్సిస్కోలో కుటుంబంతో సహా ఉంటున్నారు. అక్కడే ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతిచెందారు. హుస్సేన్​ కథక్​ నర్తకి మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. అనిసా, ఇసాబెల్లా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. 1951లో ముంబైలో జన్మించిన జాకీర్​ హుస్సేన్​ 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. 2009లో తన మొదటి గ్రామీ అవార్డును అందుకున్నారు. 2024లో అతను 3 విభిన్న ఆల్బమ్‌లకు 3 గ్రామీలను కూడా గెలుచుకున్నారు.

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కేవలం 11 ఏళ్ల వయసులో అమెరికాలో తన మొదటి సంగీత కచేరీని ప్రదర్శించారు. 1973లో అతను తన మొదటి ఆల్బమ్ ‘లివింగ్ ఇన్ మెటీరియల్ వరల్డ్’ని ప్రారంభించారు. మాస్ట్రో తన మొదటి గ్రామీ అవార్డును 2009లో అందుకున్నాడు. జాకీర్ హుస్సేన్ మొత్తం 4 గ్రామీ అవార్డులను కూడా గెలుచుకున్నారు.

జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్‌.. 
2024 అక్టోబర్‌లో జాకీర్ హుస్సేన్ అమెరికాలో శరదృతువును గడుపుతున్నట్లు చివరి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు విశేషాదరణ పొందుతుంది. ఈ పోస్టులో అమెరికా వాతావారణం గురించి తెలిపారు.

ప్రధాని మోదీ సంతాపం..
తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన నిజమైన మేధావి అని కొనియాడారు.  అసమానమైన లయతో లక్షలాది మందిని ఆకర్షించి, తబలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చారన్నారు. భారతీయ శాస్త్రీయ సంప్రదాయాలను ప్రపంచ సంగీతంతో సజావుగా మిళితం చేసి, సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మారాడన్నారు. అతని దిగ్గజ ప్రదర్శనలు, మనోహరమైన కంపోజిషన్‌లు తరాల సంగీత విద్వాంసులు, సంగీత ప్రియులను ఒకే విధంగా ప్రేరేపించడానికి దోహదం చేస్తాయన్నారు. హుస్సేన్​ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచ సంగీత సంఘానికి ప్రధాని మోదీ హృదయపూర్వక సానుభూతి తెలిపారు. 

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి నివాళులు..
జాకీర్​ హుస్సేన్​ మరణవార్త తనని బాధకు గరి చేసిందని తెలంగాణ రాష్​ర్ట బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ విచారం వ్యక్తం చేశారు. తన ప్రతిభతో ఎన్నో హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. తన లయబద్ధమైన వాయిద్యంతో అసాధారణ ప్రతిభను చూపారని అన్నారు. ప్రతీ ఒక్కరి మనస్సులను ఈయన ప్రదర్శించిన కళ ఆకట్టుకుందన్నారు. జాకీర్​ హుస్సేన్​ లెజెండ్​ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.