యోగి పాలన రౌడీలకు ముచ్చెమటలు
గుండారాజ్ మాట వినబడదన్న మంత్రి యూపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా
లక్నో: యూపీ నుంచి గతంలో వ్యాపారులు వెళ్లేవారని, ప్రస్తుతం రౌడీలు వెళుతున్నారని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. యూపీలోని మొరాదాబాద్ లో శుక్రవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ రౌడీల పెత్తనానికి, రాజకీయ నేతల తీరుకు విసిగివేసారిపోయి వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేవారని షా అన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక రౌడీలు, అవినీతి రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించామన్నారు. ప్రస్తుతం వారికి పలాయనం చిత్తగించే పనిని అప్పజెప్పామన్నారు.
రౌడీ మూకలకు సింహాస్వప్నం యోగి..
యూపీలో ఇక గుండా రాజ్ మాట వినబడకుండా చేశామన్నారు. ఇక్కడ నిర్భయమైన, అభివృద్ధి సాధకుడు పరమ యోగి ప్రభుత్వం ఉందని తెలిపారు. సామాన్య ప్రజలకు ఈయన వల్ల ఎలాంటి భయాందోళనలు అక్కరలేదని అవినీతి, రౌడీమూకలకు ఈయన హనుమంతుడి లాంటి వారని కొనియాడారు. ఈయన హయాంలో వ్యాపారులు, నిరుపేదలు, మహిళలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. 2013లో యూపీలో అల్లర్లు, గోవుల అక్రమ రవాణాలు గుండాల పాలనతో ప్రజలు విసిగిపోయారని, నష్టపోయారని అన్నారు.
వారి పాలనలో వెళ్లిన వ్యాపారస్థులకు అభయం కల్పిస్తు వెనక్కి రప్పిస్తున్నామని షా తెలిపారు. ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణను ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దేశం అభివృద్ధితోపాటు, రాష్ర్టం కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం యోగి చర్యలు కఠినంగానే ఉంటాయన్నారు. ఆయన ఏ విషయంలోనూ వెనకడుగు వేయబోరని స్పష్టం చేశారు.
మోదీకి హ్యాట్రిక్ అందించనున్న యూపీ..
మోదీ హయాంలో అనేక సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోగలిగామని స్పష్టం చేశారు. ఐదువందల ఏళ్లనాటి సమస్యను చిటికెన వేలుతో శాంతిపూర్వకంగా అయోధ్య వివాదాన్ని రూపుమాపామన్నారు. ప్రధాని మోదీ పదవికి కారణం యూపీ అన్నారు. ఇక్కడ నుంచి అత్యధికంగా 2014లో 73, 2019లో 65 స్థానాలు లభించాయన్నారు. 2024లో మొత్తం 80 స్థానాలను కైవసం చేసుకోనున్నామని హ్యాట్రిక్ గా ప్రధాని మోదీని ఎన్నుకోనున్నామని షా తెలిపారు.
కాంగ్రెస్ వి తలదించుకోలేకే వ్యతిరేకత డ్రామాలు..
రామ మందిర నిర్మాణాన్ని చూసి భయపడి విపక్ష పార్టీలు ఆ కార్యక్రమాన్నే బహిష్కరించాయని పేర్కొన్నారు. సమస్యను తీర్చుకోలేక ఓ వైపు నలిగి పోయాయని, మరోవైపు మందిర ప్రారంభంతో సిగ్గుతో దేశ ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు వ్యతిరేకత పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే డ్రామాలు, నాటకాల పార్టీ అని అన్నారు.
ఉగ్రవాదాన్ని తుద ముట్టించాం..
ఇటు యోగి నాయకత్వంలో రౌడీల పని పడుతుంటే, అటు మోదీ నాయకత్వంలో ఉగ్రవాదుల పనిపడుతున్నారని అమిత్ షా అన్నారు. పదేళ్లలో ఉగ్రవాదం, నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపగలిగామని పేర్కొన్నారు. బద్రీనాథ్, కేదార్ నాథ్, విశ్వనాథ్, సోమనాథ్ లాంటి చారిత్రక ఆలయాలకు ప్రాధాన్యతను పెంచగలిగామని షా తెలిపారు. గుండాల చర్యలకు విసిరివేసారి యూపీ నుంచి హిందువులు వెళ్లేవారని పేర్కొన్నారు. హిందూ దేశంలో హిందువులు ఎక్కడకు వెళతారని? ప్రశ్నించారు. ఇలాంటి గుండాల చర్యలను యోగి ఆదిత్యనాథ్ పెకిలించి వేస్తున్నారని తెలిపారు.
దేశమంతా కొనసాగినట్లే యూపీలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు లభిస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.