మహిళాభివృద్ధికి రెట్టింపు వేగంతో పని

ఎల్​ ఐసీ బీమా సఖీ ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ

Dec 9, 2024 - 17:40
 0
మహిళాభివృద్ధికి రెట్టింపు వేగంతో పని

9వ సంఖ్య శక్తికి నిదర్శనం
పానిపట్​ నుంచే మహిళాభివృద్ధికి శ్రీకారం
భూమ్యాకాశాల్లోనూ మహిళల పాత్ర ఉండాలన్నదే తమ లక్ష్యం

పానిపట్​: మహిళా అభివృద్ధికి డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎల్​ ఐసీ బీమా సఖీ పథకం ద్వారా మహిళా సాధికారతకు గణనీయంగా దోహదం చేస్తుందన్నారు. సోమవారం హరియాణాలోని పానిపట్​ లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎల్​ ఐసీ బీమా సఖీ పథకాన్ని ప్రారంభించారు.

బలమైన సాధికారతకు ముందడుగు..
మహిళా సాధికారత దిశగా మరో బలమైన ముందడుగు వేశామని మోదీ తెలిపారు. ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదన్నారు. 9వ సంఖ్యను గ్రంథాలలో కూడా శుభప్రదంగా భావిస్తారని తెలిపారు. నవదుర్గ అమ్మవారితో ఈ సంఖ్య ముడిపడి ఉండడం నూతన శక్తికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ పరిషత్​ తొలి సమావేశం కూడా 9వ తేదీనే జరిగిందన్నారు. 9వ తేదీ సమానత్వం, అభివృద్ధిని విశ్వవ్యాప్తం చేస్తుందని నూతన కార్యక్రమాలు చేపట్టేవారికి స్ఫూర్తినిస్తుందన్నారు. 

అక్కాచెల్లెళ్లకు ఉపాధి..
దేశంలోని అక్కాచెల్లెళ్లకు ఉపాధి కల్పించేందుకు ‘బీమా సఖీ యోజన’ ప్రారంభించామని ఇదే పానిపట్​ లో కొన్నేళ్ళ క్రితం ‘బేటీ బచావో- బేటీ పఢావో’ ను ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ పథకాల ప్రయోజనాలు హరియాణాతోపాటు దేశమంతటా లభిస్తున్నాయని తెలిపారు. ఈ పథకం దేశ, పానిపట్ మహిళా శక్తికి ప్రతీకగా మారనుందని ప్రధాని మోదీ తెలిపారు. మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పుష్కలమైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. వారి ముందున్న ప్రతీ అడ్డంకిని తొలగిస్తున్నామన్నారు. 

ఆర్థికంలోనూ సింహాభాగం ఉండాలి..
గత ప్రభుత్వాల్లో మహిళలంటే నిషేధం అనే పలు ఉద్యోగాలుండేవని, కానీ డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం ఆ తీరును పూర్తిగా మార్చివేస్తుందన్నారు. ప్రతీ రంగంలోనూ మహిళల భాగస్వామ్యం ఉండాలన్నదే తమ లక్ష్యమన్నారు. భూమి నుంచి ఆకాశం వరకూ, గ్రామం నుంచి నగరం వరకూ, దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేశామన్నారు. స్వాంతంత్ర్యం వచ్చి 65 యేళ్లు గడిచినా వారికి బ్యాంకు ఖాతాలు సైతం ఇవ్వలేకపోయారన్నారు. కానీ తమ ప్రభుత్వ 30 కోట్ల మందిని జన్​ ధన్​ ద్వారా ఖాతాలను తెరిచిందన్నారు. నేడు సేవ పేరుతో మహిళలను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసే బృహత్తర కార్యక్రమానికి నాందీ పలికామన్నారు. 

మహిళలంటే ఓటు బ్యాంకు కాదు.. ఆర్థిక పరిపుష్టికి కారకులు..
10 కోట్ల మంది మహిళలకు గత పదేళ్లలో ఒక్కో సంఘానికి రూ. 8 లక్షలకు పైగా సహాయం అందజేశామన్నారు. దీని ద్వారా మహిళలు అసాధారణ ప్రతిభను కనబరుస్తూ దేశం ఆర్థిక ప్రగతిశీల పథంలో నడిచేందుకు తోడ్పాటునందిస్తున్నారని మోదీ తెలిపారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్​ ను తీర్చిదిద్దడంలో మహిళలు కూడా నిమగ్నం కావాలని సింహభాగం మహిళల భాగస్వామ్యం ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మహిళలంటే కేవలం ఓటు బ్యాంకు కాదని బలమైన ఆర్థిక వ్యవస్థ రూపకల్పనలోనూ తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపించుకోవాలన్నారు.