శ్రీరామున్ని టెంట్ లోకి తరలిస్తారా? బుల్ డోజర్ నడుపుతారా?
రాయ్ బరేలీ ప్రధాని అభ్యర్థి ప్రచారం అఖిలేష్ కన్నీళ్లే మిగిలాయి కూటమి పార్టీలకు హ్యాండ్ బుల్ డోజర్ నడపడంపై యోగితో ట్యూషన్ చెప్పించుకోండి తాతలు, తండ్రుల సంపాదనను లెక్కిస్తారా? పూర్తి రిజర్వేషన్లు ముస్లింలాకా? దేశాన్ని ఎవ్వరైనా ముక్కలు చేస్తారా? యూపీ బారాబంకిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
పాట్నా
హస్తం, కూటమి పార్టీలు గెలిస్తే రామ మందిరంపై బుల్‌డోజర్ నడుపుతామని, తిరిగి టెంట్లోకి తరలిస్తామని విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాయ్ బరేలీ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే అఖిలేష్ యాదవ్ గుండె పగులిందని అన్నారు. బుల్‌డోజర్లు నడపాలంటే యూపీ సీఎం యోగితో ట్యూషన్ చెప్పించుకోవాలని ఎద్దేవా చేశారు. మీ తాతలు, తండ్రులు సంపాదించిన సంపాదన, బంగారం, వెండి, చివరాఖరికి మంగళసూత్రాల లెక్క కూడా తీసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లు కాస్త కర్ణాటకలో ముస్లింలకు కల్పించి తీవ్ర ద్రోహం చేశారన్నారు. రిజర్వేషన్లపై మరోపార్టీ అధినేత ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు మొత్తం ముస్లింలకే దక్కాలని విచిత్ర వాదన చేస్తున్నారని ఆరోపించారు మరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలంతా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఒక్కటిగా ఉన్న దేశాన్ని ఎవ్వరైనా విడగొడతారా? అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ హయాంలో విభజనలు జరిగింది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం యూపీలోని బారాబంకీలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించారు. లాకర్లలో ఏముందో చూసి స్వాధీనం చేసుకునే ప్రభుత్వం కావాలా, తాత ముత్తాతల ఆస్తులను కాపాడే ప్రభుత్వం కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలనిప్రధాని పేర్కొన్నారు
యూపీలో గతంలో జిహాదీలు, రౌడీలదే రాజ్యంగా కొనసాగిన విషయం మరిచిపోవద్దన్నారు. వీరి దుష్ట, ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల వల్ల దేశం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూటమి పార్టీలన్నీ కలిసి ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉండగా రాయ్ బరేలీలో యువరాజే ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటుంటే కూటమి పార్టీల గుండెలు పగులుతున్నాయని, పదవిపై ఆశలు పెట్టుకున్నవారి కళ్లలో నీళ్లొస్తున్నాయని ప్రధాని విమర్శించారు. కూటమి పార్టీలకూ చేయిచ్చి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించుకోవడం వారి అవివేకానికి, చేతగాని తనానికి, అవకాశ వాదానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా కూటమిలోని మిగతా పార్టీలు కాంగ్రెస్ ఎలాంటి రాజకీయాలకు పాల్పడుతుందో గుర్తించాలని ప్రధాని తెలిపారు.
దేశంలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, రామ మందిర నిర్మాణ కల సాకారం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఎంతోమంది ముస్లిం మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ పై హర్షం వ్యక్తం చేస్తుంటే వారిని తప్పుదోవ పట్టించేలా తామొచ్చాక వీటన్నింటిని రద్దు చేస్తామనడంపై మోదీ మండిపడ్డారు. మహిళా లోకానికి గౌరవం పెంచే చర్యలను తాము తీసుకుంటున్నామన్నారు. అందుకే మహిళల రిజర్వేషన్లు పెంచామన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా కీలకమన్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో తాము ముందుకు వెళుతున్నామని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు విపక్ష పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే డాక్టర్ బీఆర్ బాబా సాహేబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చబోమని మరోమారు పునరుద్ఘాటించారు. లేనిపోని అపోహలు, అనుమానాలను సృష్టిస్తూ ఓట్లను దండుకోవాలని విపక్షాలు చూస్తున్నాయన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగాన్ని మార్చేలా ప్రయత్నించిందని ఎవరిని నిలదీశారు. ఎట్టిపరిస్థితుల్లోనే ఆదివాసీ, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవద్దని సూచించారు.
రామ మందిర నిర్మాణం సుదీర్ఘకాలం కల అని మోదీ పేర్కొన్నారు. 500 యేళ్లుగా ఈ వివాదం కొనసాగుతోందన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు ఈ విషయాన్ని తెలుసుకొని ఓటు వేయాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కేవలం ఐదేళ్లలో ఆ సమస్యను కూకటివేళ్లతో సహా పెకిలించి శ్రీరామ మందిరాన్ని నిర్మించుకోగలిగామని పేర్కొన్నారు.
దేశ హితం కోసం బలమైన, నమ్మకమైన, విశ్వాసమైన, ధైర్యమైన నిర్ణయాలు తీసుకునే సత్తా కేవలం బీజేపీకే ఉందని దేశ ప్రజలు గుర్తించాలన్నారు. అదే సమయంలో దేశానికి ద్రోహం చేసే వారేవరో కూడా గమనించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబతత్వం, కుర్చీ కోసమే ఆ పార్టీలు మీ ఓట్లను దండుకునేందుకు వస్తున్నాయని తెలిపారు.
వంద సీసీ ఇంజన్ తో వెయ్యి స్పీడ్ ని (అభివృద్ధి)ని అందుకోవాలంటే కేవలం బీజేపీ ప్రభుత్వం వల్లే అది సాధ్యపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.