పొరుగు దేశాలతో సత్సంబంధాలే కోరుకుంటాం

విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​

Dec 13, 2024 - 16:48
 0
పొరుగు దేశాలతో సత్సంబంధాలే కోరుకుంటాం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశం చైనా, మాల్దీవులు, నేపాల్​, శ్రీలంక, భూటాన్​, బంగ్లాదేశ్​ వంటి పొరుగు దేశాలకు మెరుగైన సంబంధాలనే కోరుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ తెలిపారు. శుక్రవారం పార్లమెంట్​ లో భారత్​ – చైనా సరిహద్దు సమస్యలు, పొరుగు దేశాల బంధాలపై సమాధానం ఇచ్చారు. పొరుగు దేశాలతో భారత్ నిబద్ధత, విశ్వాసం, నమ్మకంతో పనిచేస్తుందన్నారు. అదే సమయంలో సరిహద్దు సమస్యలను శాంతిపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. భారత్​ ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో స్నేహసంబంధాలు కొనసాగించాలనే భావిస్తోందన్నారు. నేపాల్​, శ్రీలంకలకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాల్లో ఎన్నో రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ సత్సంబంధాలనే కోరుకున్నారని తెలిపారు. మాల్దీవులలో 28 దీవులకు మంచినీరు, మురుగు నీటి ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాలకు భారత్​ మద్ధతునిస్తుందన్నారు. అయినా మాల్దీవులు భారత కంపెనీలను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశాల సంబంధాల్లో హెచ్చు తగ్గులుంటాయని తెలిపారు. విదేశాంగ విధానాన్ని పక్షపాత దృష్టితో చూడవద్దన్నారు. పొరుగుదేశాల్లో జరుగుతున్న అంతర్గత రాజకీయ, ఆర్థిక, సుస్థిరత, అభివృద్ధి లాంటి విషయాలు కూడా ఇతర దేశాలతో సంబంధబాంధవ్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకునే భారత్​ తమ విధానంలో పరిణితితో వ్యవహరిస్తుందన్నారు. దేప్సాంగ్​, డెమ్​ చోక్​ వంటి ఒప్పందాలు అమలు జరిగాయన్నారు. సరిహద్దుల్లో భద్రతా దళాలు కూడా గస్తీ నిర్వహిస్తాయని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలలో మార్పును ప్రదర్శిస్తే పురోగతి సాధ్యమన్నారు. పాక్​ చర్యలు భారత్​ సంబంధాలతో  ఆధారపడి ఉన్నాయని మంత్రి ఎస్​. జై శంకర్​ స్పష్టం చేశారు.