వెన్నులో వణుకు పుట్టిస్తున్నాం
బలహీన ప్రభుత్వం వల్లే అణగదొక్కిన శత్రుదేశాలు హస్తంపై మండిపాటు ఉత్తరాఖండ్ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
రిషికేశ్: చేతగాని బలహీన ప్రభుత్వాన్ని చూసి శత్రుదేశాలు అణగదొక్కే చర్యలకు దిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. నేడు ఆ ప్రభుత్వ చర్యలు భారత్ కు శాపంగా పరిణమించాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక తమ సత్తా ఏంటో చూపెడుతోందని దీంతో ఆయా శత్రుదేశాల వెన్నులో వణుకుపుడుతోందని ప్రధాని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ ఐడీపీఎల్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కనీసం సైనికులకు రక్షణ పరికరాలు, ఆయుధాలు, డ్రెస్సులు, బూట్లు కూడా ప్రామాణికతలకు అనుగుణంగా లేవని మండిపడ్డారు. వీరి హయాంలోనే ఉగ్రవాదం భారత్ లో అశాంతిని రేకెత్తించిందన్నారు. ఇప్పుడు దాన్ని సరిచేసేందుకు తమకు పదేళ్ల సమయం పట్టిందన్నారు. నేడు దేశంలో ఎక్కడా ఉగ్రవాద ఛాయలు కనిపించబోవని మోదీ అన్నారు. సైన్యానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ స్వేచ్ఛనీయడంతో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి వారు నిరూపించుకుంటున్నారని తెలిపారు.
అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకం..
కాంగ్రెస్ అభివృద్ధికి వ్యతిరేకమని ప్రధాని అన్నారు. రాముడి ఉనికిపైనే ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం సందర్భంగా కోర్టులో అడ్డంకులు కూడా సృష్టించారని తెలిపారు. అయినా తాము రామాలయ ప్రాణప్రతిష్ఠకు రావాలని ఆహ్వానిస్తే గర్వంతో, అహాంకారంతో భగవంతుడు సన్నిధికే రాలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని దేశంలోని హిందువులంతా గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగానది ఉనికిపై కూడా ఆ పార్టీ ప్రశ్నలు వేస్తోందని మండిపడ్డారు. వీరికి ప్రజలే సరైన రీతిలో జవాబు చెప్పాలని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, సురక్షిత దేశం, నిరుపేదల సంక్షేమం కోసం కమలాన్ని వికసింప చేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట..
ఉజ్వల గ్యాస్, నారీశక్తికి రిజర్వేషన్, జల్ జీవన్ మిషన్, ఉచిత రేషన్, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు తాము అధిక ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ర్టంలోని పది నిరుపేదల ఇళ్లలో తొమ్మిది ఇళ్లకు ఈ సౌకర్యాలు కల్పించామన్నారు. రాబోయే సమయంలో పదో కుటుంబానికి కూడా తమ సంక్షేమ పథకాలు అందజేస్తామని మోదీ హామీ ఇచ్చారు. దేశంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా ఉండకూడదన్నదే తమ ఉద్దేశ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదే తమ లక్ష్యమన్నారు.
దళారుల పార్టీ కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ దళారుల పార్టీ అని, అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, నిరుపేదల సొమ్ములను హస్తం పార్టీ నేతలు దోచుకొని సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. తాము వారు చేసిన అవినీతి సొమ్మును కక్కిస్తుంటే, అవినీతిపరులపై చర్యలు తీసుకుంటుంటే తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అవినీతిపరులను రక్షించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజాశీస్సులు ఉంటే అవినీతి సొమ్మంతా కక్కిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్ వసుదైక కుటుంబం అని ఇది నా కుటుంబమని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.
పర్యాటక రంగానికి ప్రోత్సాహం..
ఉత్తరాఖండ్‌ను అభివృద్ధి చేయడంలో పర్యాటక రంగం పెద్ద పాత్రను పోషిస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం చేకూర్చేందుకు రోడ్డు మార్గాలు, రైల్వేలు, వాయుమార్గాలు లాంటి సౌకర్యాలను పెద్ద యెత్తున చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామని మరిన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇక్కడ రిషికేశ్ కర్ణప్రయాగ్ రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మోదీ తెలిపారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు దూరం తగ్గించగలిగామని తెలిపారు. ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామం వరకు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను చేరుస్తామని స్పష్టం చేశారు. ఆదికైలాశ్ యాత్ర కోసం హెలికాప్టర్ సర్వీస్ ను కూడా ప్రారంభించామని తెలిపారు. కేదార్ నాథ్ లో యాత్రికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని స్పష్టం చేశారు.
లక్షమందికి పెన్షన్..
మోదీ ప్రభుత్వం లేకుంటే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు అయ్యేది కాదని ప్రధాని మోదీ అన్నారు. లక్ష మంది మాజీ సైనికుల బ్యాంకు ఖాతాలకు రూ.1,00,000 కోట్లకు పైగా నగదు బదిలీ చేశామని తెలిపారు.
ఆకర్షణగా డోలు..
ప్రధాని మోదీ సభకు చేరుకొని డోలు వాయించడంతో పలువురిలో ఆశ్చర్యం, ఆనందాలు వ్యక్తమయ్యాయి.