- – అంబర్ పేట ప్రచారంలో కేంద్ర మంత్రి
- – మరోసారి ఎంపీగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి
నా తెలంగాణ, హైదరాబాద్:
దేశం ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి మోదీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు కిషన్ రెడ్డి శనివారం అంబర్ పేట నియోజకవర్గంలోని గోకుల్ దామ్ అపార్ట్ మెంట్స్, కాచిగూడ, జైస్వాల్ గార్డెన్, గోల్నాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు. సికింద్రాబాద్ నుంచి నేను మరోసారి పోటి చేస్తున్నాను. ఎంపీగా సికింద్రాబాద్ ప్రజల గౌరవాన్ని కాపాడాను. అనేక అభివృద్ది పనులను చేపట్టాను. పేదల ప్రజలకు అండగా నిలిచాను. మోదీ పదేళ్ల పాలన ఎలా కొనసాగిందో అందరం చూశాం. భద్రతా, విదేశీ విధానం, ఆర్థిక విధానంలో, సంక్షేమ పథకాలు ఇలా అన్నింటిలోనూ మోదీ సమర్థవంతంగా పాలన కొనసాగించారు. దేశంలో ఉగ్రవాదుల దాడులు ఉండేవి.. నేడు దేశం ప్రశాంతంగా మారింది. పాకిస్తాన్ ఆట కట్టించారు. ముస్లిం మహిళల పట్ల అనాగరికంగా ఉన్న ట్రిపుల్ తలాక్‌ను మోదీ రద్దు చేశారు. 500 ఏళ్ల రామజన్మభూమి సమస్యను తీర్చారు. జీఎస్టీతో పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు”అని కిషన్ రెడ్డి తెలిపారు.
ఓటింగ్ శాతం పెరగాలి..
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ‘‘ఒకప్పుడు దిగుమతి చేసుకున్న సెల్ ఫోన్లు.. ఇప్పుడు దేశంలో తయారవుతున్నాయి. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. 3వ స్థానానికి చేర్చాలన్నది మోదీ తదుపరి లక్ష్యం. ఓటు పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. మజ్లిస్ పార్టీ స్థానాల్లో 80 శాతం పోలింగ్ అవుతుంది. మన ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదవుతుంది. కాబట్టి అందరూ ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలి. ఈ సందర్భంగా మోదీని ఆశీర్వదించాలని కోరుతున్నాను.