దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్
తెలంగాణలో 1200మంది రైతుల ఆత్మహత్యలు
ఎంఎస్ పీ ఎందుకు అందించడం లేదు
తానున్నంత వరకూ దళిత రిజర్వేషన్లు ముట్టుకోలేరు
చండీగఢ్: రైతు సమస్యలపై కాంగ్రెస్, మిత్రపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ దే అని ఆరోపించారు. వారినోటికాడ కూడును కూడా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్టీ వల్లే నక్సలిజం పుట్టుకువచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు ఏం మేలు చేకూరుస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో 1200మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. దళిత రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ హరించాలని చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ ఉపాధి కరువై దేశ యువత అల్లాడిపోయారన్నారు. ఉద్యోగాలలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వం వారిదన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హరియాణాలోని కురుక్షేత్ర ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
హరియాణా ప్రజలకు కేంద్రం అనేక రకాల సంక్షేమ పథకాలు కల్పిస్తుండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని అందుకే ఇక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రయత్నిస్తుందన్నారు. రాచరిక కుటుంబ పాలనకు రాహుల్ గాంధీ కుటుంబం తెరలేపిందన్నారు. మోదీ ఉన్నంత కాలం దళిత రిజర్వేషన్లను ముట్టుకోలేరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో మారిగా పరిస్థితులు మారుతాయని హెచ్చరించారు. ఆ రాష్ర్ట ఉద్యోగులకు కనీసం జీతాలివ్వలేని స్థితిలో ఆయా ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. కర్ణాటకలో ఏకంగా గణనాథున్ని కూడా జైలులో బంధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతకల్లోలానికి ప్రయత్నిస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుకుంటుందన్నారు.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులకు 24 పంటలకు ఎంఎస్ పీ ఇస్తుందని గుర్తు చేశారు. మరీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఆ పార్టీలోనూ అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయని తెలిపారు.
దేశ సమైక్యతను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, కొత్తగా అర్బన్ నక్సలిజం అని ప్రజలను, యువతను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. దేశ జవాన్లపై సైతం రాళ్లను విసిరేలా చేస్తుందని మండిపడ్డారు. వీరి బుజ్జగింపు, విద్వేశ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. ఆర్టికల్ 370 రద్దు, దళిత రిజర్వేషన్లను రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఈ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనలో కూడా ఓబీసీల రిజర్వేషన్లను నిషేధించిందన్నారు.
హరియాణా ప్రజలు ఇలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
హరియాణాలో బీజేపీ ప్రభుత్వం పూర్తి సేవాభావంతో పనిచేస్తుందని కొనియాడారు. ఇందుకు తాను గర్వపడుతున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి కుళాయి, విద్యుత్ బిల్లులు తగ్గించడం లాంటి పనులను చేపట్టామన్నారు. ఇక్కడి ప్రజలు తనకు ప్రేమాభిమానాలను పంచారని వారి మేలు ఎన్నటికీ మరువలేనిదని ప్రధాని పేర్కొన్నారు.