మోదీ పాక్ తోక కత్తిరించారు: కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy said that terrorist attacks used to happen during the Congress rule and Modi has ended terrorism
- ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపారు
- కాంగ్రెస్ పాలనలో మంత్రులే స్కామ్ లలో జైలుకెళ్లారు
- గత తొమ్మిదిన్నరేండ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి లేదు
- దేశం కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి
- హైదరాబాద్ లో ఓటింగ్ శాతం మరింత పెరగాలి
- బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
నా తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ సహా దేశంలో అనేక చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, పాక్ ఐఎస్ఐ ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేదని, మోదీ వాటి తోకలు కోశారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి అన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో వివిధ కుంభకోణాలకు పాల్పడి కాంగ్రెస్ పార్టీ మంత్రులే జైలుకు వెళ్లారని, మోదీ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చిలకలగూడ, బౌద్ధనగర్, సీతాఫల్ మండి తదితర బస్తీల్లో పర్యటించారు. కాలనీల్లో కిషన్ రెడ్డికి అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. మహిళలు, కాలనీ పెద్దలు, పుర ప్రముఖులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
‘‘దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో 4వ ఫేస్ లో మే13న ఎన్నికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వేశాకే టిఫిన్ చేయాలి. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి.
హైదరాబాద్ నగరంలో 40 శాతం కూడా పోలింగ్ జరగడం లేదు. ఈసారి పెరగాలి. ప్రజలకు సౌకర్యాలు లేవని ప్రతీ ఒక్కరు విమర్శిస్తరు. ప్రతీ ఒక్కరికి విమర్శించడానికి ఎంత హక్కు ఉందో ఓటు వేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. ఐదేండ్లకు ఒక్కసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ కుటుంబ సభ్యులతో చర్చించి వేయాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం..
దేశం కోసం జరిగే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే దేశం భద్రంగా ఉంటదో, దేశ గౌరవం పెరుగుతుందో, మన పిల్లల భవిష్యత్తు బాగుంటదో ఆలోచించి ఓటు వేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ‘‘కాంగ్రెస్ హయాంలో దేశంలో, హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాకిస్తాన్ వాళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పాకిస్తాన్ కు సంబంధించిన ఐఎస్ఐ ఉగ్రవాదాలు తోకలు కోశాం. నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచి వేసింది. ఇది మోదీ భారతం, కొత్త భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పినం. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపి ఆ దేశాల్లో చిక్కుకున్న 25 వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్రమోదీది. ఆయన నాయకత్వంలో సమర్థంగా పని చేస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం కారణంగా జమ్మూ కశ్మీర్ లో 46 వేల మంది చనిపోయారు. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. యూపీఏ పాలనలతో దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ తీయాలని ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు తినడానికి తిండి దొరకడం లేదు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ దేశాల ముందు పాక్ ను ఏకాకిని చేశారు”అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
పైసా అవినీతి లేదు..
కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా ఉన్న కనిమొళి, రాజా అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో రూపాయి అవినీతి జరగలేదు. ధర్మబద్ధంగా, నీతి, నిజాయితీగా మోదీ పని చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం ఎలా ఉందో, మోదీ హయాంలో దేశం ఎలా ఉందో తేడా చూసి ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను”అని కిషన్ రెడ్డి తెలిపారు.