మోదీ అభివృద్ధి చూసి ఓటేయండి: కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy has called upon the people to see the progress made under Modi's regime and cast the votes
- ఇవి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
- దేశంలో అనేక సమస్యలు పరిష్కరించిన మోదీ
- నాకు మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం కల్పించారు
- మరోసారి బీజేపీని బలపరచాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి
- అంబర్ పేట నియోజకవర్గంలో బస్తీ పర్యటన
నా తెలంగాణ, హైదరాబాద్: ఈ ఎన్నికలు ఎవరు దేశానికి ప్రధానిగా ఉండాలనేది నిర్ణయించబోతున్నాయని, మోదీకి ముందు మోదీ తర్వాత దేశంలో పాలన ఎలా ఉందో అందరూ ఆలోచించాలని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అనేక సమస్యలు పరిష్కరించిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కొరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం కిషన్ రెడ్డి అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ క్వార్టర్స్, రఘునాథ్ నగర్, బాపునగర్, చెన్నారెడ్డి నగర్ బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా వంటి విపత్కర పరిస్థితి నుంచి మోదీ దేశాన్ని కాపాడారు. కరోనాను తరిమికొట్టేలా అందరికీ ధైర్యం ఇచ్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ను ప్రోత్సహించి అందరికీ ఉచితంగా అందించారు. పేదలకు ఉచితంగా బియ్యం అందించారు”అని గుర్తు చేశారు.
ఆర్ఆర్ఆర్ తో ఉపాధి అవకాశాలు..
తనపై నమ్మకంతో ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని ప్రజలు కల్పించారని, తద్వారా తాను మోదీతో కలిసి నార్త్ బ్లాక్ లో కూర్చొని దేశ అభివృద్ధికి సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ‘‘370 ఆర్టికల్ రద్దుతో జమ్మూ కశ్మీర్‌లో అహింస తగ్గించారు మోదీ. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ.760 కోట్లతో ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నాం. నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లను కూడా ఆధునీకరిస్తున్నాం. 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించాం. ఆర్ఆర్ఆర్ ను రూ. 26 వేల కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ రోడ్డు పూర్తయితే అనేక కంపెనీలు వస్తాయి. యువతకు ఉపాధి లభిస్తుంది. పార్కులు, కమ్యూనీటి హాల్స్ నిర్మించాం. మహిళలకు స్వయం ఉపాధి పొందడం కోసం శిక్షణ ఇస్తున్నాం. గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అంబర్‌పేటలో అనేక స్కూల్స్ నిర్మించాను. అంబర్‌పేటగా బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుతున్నాను. భారీ మోజార్టీ గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను”అని కిషన్ రెడ్డి కోరారు. బస్తీ పర్యటనంలో భాగంగా సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు.