విలేఖరుల సమస్యల పరిష్కారానికి కృషి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
Union Minister G. Kishan Reddy is working to solve the problems of journalists

ఐఎఫ్ డబ్ల్యూజే, టీడబ్ల్యూ జేఎఫ్ వినతిపత్రం సమర్పణ
నా తెలంగాణ, హైదరాబాద్: విలేఖరుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు శక్తివంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తానని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. జర్నలిస్టుల పెన్షన్ స్కీం అమలు చేసే అంశాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. హౌసింగ్ సొసైటీలపై సుప్రీం తీర్పు అంశం న్యాయశాఖ పరిధిలో ఉన్నందున, ఆ శాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరానికి తనవంతు ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం జర్నలిస్టుల పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఐఎఫ్ డబ్ల్యూ జే (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్) జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) రాష్ర్ట అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్ తదితరులు శనివారం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమస్యలను కేంద్రమంత్రికి వివరించారు. పెన్షన్, రైల్వే పాస్ లు, ప్రత్యేక రక్షణ చట్టం, జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు, హౌసింగ్ సొసైటీలకు స్థలాల కేటాయింపు తదితరాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని సమస్యల పరిష్కరానికి పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆయా అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడతానని స్పష్టం చేశారు.