భూ రికార్డుల డిజిటలైజేషన్​ సమసిపోనున్న భూ వివాదాలు

Digitization of land records will end land disputes

Jan 18, 2025 - 14:17
 0
భూ రికార్డుల డిజిటలైజేషన్​ సమసిపోనున్న భూ వివాదాలు

స్వామిత్ర యోజనలో ప్రధాని నరేంద్ర మోదీ
10 రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 65 లక్షల ఆస్తి కార్డుల పంపిణీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశాభివృద్ధిలో భూమి, ఇళ్లు పెద్ద పాత్ర పోషిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భూరికార్డులను డిజిటలైజ్​ చేయడం వల్ల వివాదాలు సమసిపోతాయని అర్హులకు, నిరుపేదల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. అలా విశ్వాసం పొందిన వారి అవసరం మేరకు బ్యాంకు రుణాలు కూడా సులభంగానే లభ్యమవుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. శనివారం స్వామిత్ర యోజన కింద పది రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50వేలకు పైగా గ్రామాల్లోని 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను యాజమానులకు పంపిణి చేశారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, లడఖ్‌లోని రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కార్డులను మంజూరు చేశారు. 

అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ఇప్పటివరకూ 2.25 కోట్లకు పైగా భూ యాజమాన్య కార్డులను సిద్ధం చేశామన్నారు. కార్డులు అందించడం ద్వారా భూ వివాదాలు పూర్తిగా సమసిపోయే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. తద్వారా రైతులు, ఇళ్ల యాజమానులు సులభంగానే రుణాలను పొందవచ్చన్నారు. డ్రోన్​ సర్వే, జీఐఎస్​, ఇతర సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా యాజమాన్య హక్కులను నిర్ధారిస్తామన్నారు. దీంతో లక్షలాది మంది రైతులకు తమ పూర్వీకుల భూములపై చట్టబద్ధ హక్కులు లభిస్తాయన్నారు. భవిష్యత్​ లో ఈ హక్కులు వారి భావితరాలకు లభిస్తాయన్నారు. దీంతో రైతులకు భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం ఏర్పడుతుందన్నారు. 

స్వామిత్ర యోజన 2020 ఏప్రిల్​ 24న ప్రారంభించారు. ఈ పథకం కింద గ్రామాల సర్వే, గ్రామ ప్రాంతాలలో మెరుగైన సాంకేతికతతో మ్యాపింగ్ చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంత వాసులకు కూడా చట్టపరమైన యాజమాన్య పత్రాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో నగరంలోని నివసిస్తున్న వారిలాగానే గ్రామీణ ప్రాంతాల వారీకి కూడా అవసరాల మేరకు క్రెడిట్​ అందాలన్న ఉద్దేశ్యం కలిగి ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు రాష్​ర్టాల్లోని ఈ పథకం కింద లబ్ధి పొందిన వారితో ముచ్చటించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్,  కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ లు హాజరయ్యారు.