మెట్రో గ్రీన్ ఛానల్ లో గుండె తరలింపు
బీజేపీ కార్యకర్త నవీన్ ఉదారతను కొనియాడుతున్న ప్రజలు
నా తెలంగాణ, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు ద్వారా గుండెను (హార్ట్) మరో ఆసుపత్రికి కేవలం 13 నిమిషాల్లోనే చేర్చారు. జనవరి 17 రాత్రి 9.30 గంటలకు ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి మెట్రోరైల్ లో వైద్యులు గుండెను సురక్షితంగా తరలించారు. అయితే గుండెను తరలించే ముందు మెట్రో అధికారులు అన్ని జాగ్రత్తలు, ఏర్పాట్లు ముందుగానే చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకుందూరు గ్రామానికి చెందిన మల్గా నవీన్ బీజేపీ కార్యకర్త ప్రమాదంలో మృతి చెందాడు. ఇతను గుండెను దానం చేయాలని గతంలోనే నిర్ణయించుకోవడంతో ఆసుపత్రి యాజమాన్యం, కుటుంబ సభ్యుల సహకారంతో గ్రీన్ మెట్రో ఛానల్ ను ఏర్పాటు చేసి గ్లోబల్ ఆసుపత్రిలో అవసరం ఉన్న వ్యక్తికి గుండెను అమర్చారు. మల్గా నవీన్ మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెను తరలించే ప్రక్రియను విజయవంతంగా చేపట్టిన వైద్యులు, అధికారుల తీరుపై హర్షం వ్యక్తం అవుతుంది. తాను చనిపోతూ మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపిన నవీన్ ఉదారతను ప్రజలు కొనియాడుతున్నారు.