24 చోట్ల ఉల్ఫా బాంబు హెచ్చరికలు
అసోంలో హై అలర్ట్ భారీగా సెర్చ్ ఆపరేషన్ లో పోలీసులు
డిస్ఫూర్: అసోంలోని 24 చోట్ల బాంబులు పెట్టామని ఉల్ఫా తీవ్రవాద సంస్థ (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం)మెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఈ బాంబులు పెట్టిన హెచ్చరికలను మీడియా సంస్థలకు కూడా మెయిల్ ద్వారా సమాచారం అందించింది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఇన్నిచోట్ల బాంబులు వెతకాలంటే సాధ్యపడదని ప్రజలు పోలీసులకు సహకరించి సమాచారం అందజేయాలని కోరారు. ఉల్ఫా ప్రకటించిన 24 చోట్లలో 8 ప్రాంతాలు కేవలం గౌహాతిలోనే ఉన్నాయి.
పెద్ద ఎత్తున పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు రంగంలోకి దిగాయి. మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ లు బాంబులు వెతికే పనిలో పడ్డాయి. కాగా నాగావ్, లఖింపూర్, శివసాగర్ లలో బాంబుల్లో ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
గౌహతిలోని నరేంగిలోని ఆర్మీ కంటోన్మెంట్ వైపు సత్గావ్ రోడ్డు, ఆశ్రమ్ రోడ్, పాన్బజార్, జోరాబత్, భేతాపారా, మాలిగావ్, రాజ్ ఘడ్ లలో బాంబులు పెట్టినట్లు ఉల్ఫా తీవ్రవాద సంస్థ హెచ్చరించింది. 19 చోట్ల బాంబులు ఎక్కడ పెట్టామో తెలిపిన ఉగ్ర సంస్థ, 5 చోట్లను మాత్రం తెలియజేయలేదు.
2004లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అసోంలోని ధేమాజీలో బాంబు పేలుడులో 10 మంది చిన్నారులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా, 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.