అరబ్ లో పరిఢవిల్లిన హిందుత్వం
యూఏఈ లో హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అబుదాబిలో బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించిన ఈ హిందూ దేవాలయం అరబ్‌దేశాల్లో అతిపెద్ద ఆలయంగా పేరు సంపాదించుకుంది. మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. బుధవారం ఉదయం ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, దేవాలయ ప్రాంగణానికి వచ్చిన ప్రధాని మోదీకి సాధువులు స్వాగతం పలికారు. అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు చేరుకున్నారు. వారిందరికీ మోదీ అభివాదం చేస్తూ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీ మెడలో పూలదండ వేసి ఈశ్వరచరణ్ దాస్ స్వామి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. స్వామినారాయణ్ పాదాల వద్ద పూల రేకులను సమర్పించారు ప్రధాని మోదీ.
"ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టాం. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది" అని బాప్స్ స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.
ఎన్నో ప్రత్యేకతలు!
దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేల మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబయ్‌లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే... ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్‌కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్‌లోని భరత్‌పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్‌లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం!