బీజాపూర్​లో ఎన్​కౌంటర్​ ఇద్దరు మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లోని బీజాపూర్ లో జరిగిన ​ఎన్​కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు బస్తర్​ రేంజ్​ ఐజీ సుందర్​ రాజ్​ తెలిపారు.

Mar 23, 2024 - 17:49
 0
బీజాపూర్​లో ఎన్​కౌంటర్​ ఇద్దరు మావోయిస్టులు మృతి

బీజాపూర్: చత్తీస్​గఢ్​లోని బీజాపూర్ లో జరిగిన ​ఎన్​కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు బస్తర్​ రేంజ్​ ఐజీ సుందర్​ రాజ్​ తెలిపారు. వివరాల ప్రకారం.. శనివారం ఉదయం గంగలూరు పోలీస్​ స్టేషన్​ పరిధి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సల్స్​కు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని సుందర్​ రాజ్​చెప్పారు. బీజాపూర్, దంతేవాడ, సూక్మా జిల్లాల ట్రై జంక్షన్​లో ప్రత్యేక ఆపరేషన్​ నిర్వహణ సందర్భంగా ఈ ఎన్​కౌంటర్​చోటు చేసుకుందన్నారు. ఈ ఆపరేషన్​లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్​జీ), ‘బస్తర్ ఫైటర్స్’,సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), మూడు జిల్లాల నుంచి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కి చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు సుందర్​రాజ్​ వివరించారు. రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు నక్సలైట్లు కాల్పులు జరిపారని, దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు. కాల్పుల అనంతరం, ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఆయుధాలు కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు మావోయిస్టులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఐజీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అదే ఆపరేషన్‌లో భాగంగా దంతెవాడ సూక్మా సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలడంతో బస్తర్ ఫైటర్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. గాయపడిన జవాన్లను బస్తర్ ఫైటర్స్-దంతెవాడకు చెందిన కానిస్టేబుళ్లు వికాస్ కుమార్ కర్మ, రాకేష్ కుమార్ మార్కంగా గుర్తించామని తెలిపారు.