జమ్మూకశ్మీర్​ లో 200మంది అధికారుల బదిలీ

నేడే ఎన్నికల తేదీని ప్రకటించనున్న సీఈసీ?

Aug 16, 2024 - 13:11
 0
జమ్మూకశ్మీర్​ లో 200మంది అధికారుల బదిలీ

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో ఎన్నికల తేదీ ప్రకటనకు ముందు భారీ ఎత్తున బదిలీల ప్రక్రియను చేపట్టారు. 200మంది అధికారులను బదిలీ చేస్తూ సాధారణ పరిపాలనా విభాగం గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం రాత్రిలోగా జమ్మూకశ్మీర్​, హరియాణా ఎన్నికల తేదీలను సీఈసీ (కేంద్ర ఎన్నికల సంఘం) ప్రకటించనుందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున బదిలీల ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేశారని అధికార యంత్రాంగం చెబుతోంది.

200మందిలో 88 మంది ఐఏఎస్​ లు, కేఏఎస్​, ఐజీ, ఎస్​ఎస్​ పీ, డీఐజీ సహా పలువురు ఉన్నతాధికారులు బదిలీ కావడం గమనార్హం. 
జమ్మూకశ్మీర్​ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా జమ్మూలో 43 అసెంబ్లీ స్థానాలకు, కాశ్మీర్‌లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జమ్మూలోని 37 సీట్లు, కాశ్మీర్ లోయలోని 46 సీట్లు, లడఖ్‌లోని 6 సీట్లతో సహా 87 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి డీ లిమిటేషన్​ కారణంగా సీట్లు పెరిగాయి. 2014లో 65 శాతం ఓటింగ్​ జరగగా పీడీపీ 28 స్థానాలను సాధించగా, బీజేపీ 25 సీట్లను సాధించి రెండో స్థానంలో నిలిచింది. మారిన జమ్మూకశ్మీర్​ పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో బీజేపీ అధికారం చేజిక్కించుకునేందుకు భారీ ప్రయత్నాలనే మొదలుపెట్టింది.