13 స్థానాల్లో గెలుపొందిన వారిదే కేంద్రంలో అధికారం!
Those who won 13 seats are the power in the center!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: 13 స్థానాల్లో గెలిచిన వారికే కేంద్రంలో అధికారం ఖాయమని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లోని 13 లోక్ సభ స్థానాల్లో గెలిచిన పార్టీలే గత ఐదు దఫాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు కావడం గమనార్హం.
తెలంగాణ: తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని 2014, 2019లోనూ బీజేపీ కైవసం చేసుకుంటూ వస్తోంది. 2014లో పార్టీ సీనియర్ నాయకుడు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బండారు దత్తాత్రేయ గెలుపొందగా, 2019లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయన విజయం సునాయాసమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
గుజరాత్ లోని వల్సాద్, బనస్కాంత, జామ్ నగర్, ఆనంద్, హరియాణాలోని ఫరీదాబాద్, కర్నాల్,అంబాలా, జమ్మూకశ్మీర్ లోని ఉదంపూర్, రాజస్థాన్ లోని అల్వార్, తెలంగాణలోని సికింద్రాబాద్, ఝార్ఖండ్ లోని రాంచీలలో గెలిచిన పార్టీలే కేంద్రంలో అధికారం చేపడుతుండడం విశేషం.
గుజరాత్: 2019లో బనస్కాంత నుంచి ప్రభాత్ భాయ్ పటేల్, జామ్ నగర్ నుంచి పూనంబెన్, ఆనంద్ స్థానం నుంచి మిథేష్ భాయ్ పటేల్, వల్సాద్ నుంచి కేసీ పటేల్ లు బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా భారీ మెజార్టీతో విజయం సాధించారు.
హరియాణా: హరియాణాలో అంబాలా, కర్నాల్, ఫరీదాబాద్ సీట్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. 2019 ఎన్నికల్లో అంబాలా నుంచి రతన్ లాల్ కటారియా, కర్నాల్ నుంచి సంజయ్ భాటియా, ఫరీదాబాద్ నుంచి క్రిష్ణన్ పాల్ గుర్జార్ లు బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా ఘన విజయం సాధించారు.
జమ్మూ కాశ్మీర్: ఉదంపూర్ నుంచి 2019లో జితేంద్ర సింగ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి గెలుపొందారు.
రాజస్థాన్: అల్వార్ నుంచి 2019లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మహంత్ బాలక్ నాథ్ యాదవ్ గెలుపొందారు.
ఝార్ఖండ్: సంజయ్ సేథ్ 2019లో రాంచీ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు.