ఎన్సీపీ సీనియర్​ నేతపై కాల్పులు.. మృతి

Senior NCP leader shot dead

Oct 13, 2024 - 12:22
 0
ఎన్సీపీ సీనియర్​ నేతపై కాల్పులు.. మృతి
కిరాయిముఠా అంటున్న పోలీసులు
ఇద్దరు అరెస్టు.. మరొకరు పరారీ
ఛాతీలో 1, కడుపులో రెండు బుల్లెట్లు
పోస్టుమార్టం పూర్తి
సాయంత్రం అంత్యక్రియలు
కాల్పుల ఘటనతో ఎన్సీపీ వర్గాల ఆందోళన
ముంబాయి: ఎన్సీపీ (నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ–అజిత్​ వర్గం) సీనియర్​ నాయకుడు బాబా సిద్దిఖీపై దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. శనివారం రాత్రి ఆయన కుమారుడు జీషాన్​ సిద్దిఖీ (ఎమ్మెల్యే) కార్యాలయం వెలుపల రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సిద్దిఖీకి వై కేటగిరి భద్రత ఉన్నా ఆ సమయంలో అతని వెంట ఒక్క పోలీసు కూడా లేడు. 
 
సిద్దిఖీ కడుపులో రెండు, ఛాతీలో ఒక బుల్లెట్​ దూసుకెళ్లింది. దీంతో బాబా సిద్దిఖీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పార్టీ వర్గాల్లో తీవ్ర అలజడి రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు. వీరంతా కిరాయి హంతకముఠాగా పోలీసులు తేల్చారు. సిద్దిఖీ హత్యకు రూ. 2 నుంచి రూ. 3 లక్షలకు సుపారీ తీసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. వీరి వెనుక గ్యాంగ్​ స్టర్​ లారెన్స్​ గ్యాంగ్​ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ముంబైలోని కూపర్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం సిద్ధిఖీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. సిద్దిఖీ మృతదేహాన్ని నివాసం మకాబా హైట్స్​ కు తరలించారు. పెద్ద యెత్తున పార్టీ శ్రేణులు ఆయనకు కడసారి నివాళులర్పించేందుకు వచ్చారు. రాత్రికి సిద్దిఖీ అంత్యక్రియలు జరగనున్నాయి. 
 
రాజకీయాల్లో సిద్ధిఖీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల పట్ల మక్కువతో అంచలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్​ పార్టీకి విశిష్ట సేవలందించిన సిద్దిఖీ 2024 ఫిబ్రవరిలో ఎన్సీపీ (అజిత్​ వర్గం)లో చేరారు.