అకాలవర్షం.. షాద్ నగర్ ఆగమాగం

కష్టాల కడలిలో పట్టణ ప్రజలు వ్యాపార సముదాయాల్లో వర్షపు నీరు లబోదిబోమంటున్న వ్యాపారులు పట్టించుకోని అధికారులు, నాయకులు

Jun 7, 2024 - 21:51
Jun 7, 2024 - 21:52
 0
అకాలవర్షం.. షాద్ నగర్ ఆగమాగం

నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ మున్సిపాలిటీలోని ప్రజలు వర్షం అంటేనే హడలిపోతున్నారు. చిన్నపాటి వర్షానికే పట్టణం అంతా ఆగమాగం అవుతుంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక పట్టణ ప్రజలు వర్షపునీటిలో నరకయాతన అనుభవిస్తున్నారు. శుక్రవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే వ్యాపార సముదాయాలలోకి, ఇండ్లలోకి నీరు చేరింది. మరికొన్ని కాలనీల ప్రజలు రోడ్లపై నీరు చేరడంతో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ హైవే రోడ్డులో దేవి గ్రాండ్ సమీపంలో ఉన్న గాంధీనగర్ కాలనీలో వ్యాపార సముదాయం సాయితేజ ఆటోమొబైల్స్, దేవి ట్రావెల్స్, మరో ఆన్​ లైన్​ కార్యాలయంలోకి నీరు చేరి వ్యాపారస్తులు నష్టాల పాలయ్యారు. వర్షం నీరు ప్రత్యామ్నాయ దిశగా డ్రైనేజీల ద్వారా పంపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండడంతో  గాంధీనగర్ కాలనీలో ప్రవహిస్తున్న నీరు మొత్తం రోడ్డుపై నుంచి వ్యాపార సముదాయంలోకి ప్రవేశిస్తుందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  

గతంలో వర్షం నీరు చేరినప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని చెప్పిన నాయకులు, మున్సిపల్ అధికారులు వాస్తవంగా సమస్య ఎదురైతే పత్తా లేకుండా పోతున్నారని వాపోయారు. దీంతో తాము నష్టాల బారిన పడుతున్నామని వాపోయారు. 

స్థానిక గోల్డెన్ పార్క్ లో చిన్నపాటి వర్షానికి వర్షం నీరు వెళ్లే మార్గం సరిగ్గా లేక ఇళ్ల మధ్య పెద్దకుంటలా మారి నీరు నిలిచింది. దీంతో ఇళ్లలో ఉన్నవారు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. 22వ వార్డు భగత్ సింగ్ కాలనీలో వర్షం కారణంగా ఓపెన్ డ్రైనేజీ నిండిపోయి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని బైపాస్ రహదారి పక్కన వెలసిన న్యూ టౌన్షిప్ కాలనీకి వెళ్లడానికి ప్రధాన రహదారిపై వర్షానికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. ఇక ప్రజలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇలా షాద్ నగర్ మున్సిపాలిటీలో వర్షాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.