మూడో విడత పోలింగ్ ప్రారంభం
11 రాష్ట్రాలు.. 93 సీట్లు, 1351 అభ్యర్థులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ భారీ బందోబస్తు మధ్య ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు.. 93 సీట్లకు గాను మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 26 స్థానాలు ఉన్న గుజరాత్‌లో సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో 25 సీట్లకే పోలింగ్ జరగుతోంది. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బరిలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా స్థానం నుంచి పోటీలో ఉన్నారు.
గుజరాత్ 25, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్‌లో 7 ఏడు స్థానాలు సహా పశ్చిమ బెంగాల్ 4, బీహార్ 5, అసోం4, గోవా 2 స్థానాలకు పోలింగ్‌కు జరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తన తొలి ఎన్నికల్లో పోర్‌బందర్ నుంచి పోటీలో ఉన్నారు.
కాగా ఏప్రిల్ 19న మొదటి దశలో 102 స్థానాలకు, ఏప్రిల్ 26న రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో 93 స్థానాలను కలుపుకుంటే 283 స్థానాలకు పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.