గానకోకిల మూడో వర్థంతి
ప్రపంచం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: యావత్ ప్రపంచం గర్వించదగ్గ భారతావని గానకోకిల లతా మంగేష్కర్. గురువారం ఆమె మూడో వర్థంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సంగీత ప్రియులు ఆమె గానంలోని మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. 36కు పైగా భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. ఈమె గానామృతానికి ప్రపంచదేశాల్లోని ప్రముఖులు కూడా ఆశ్చర్యచకితులయ్యారంటే అతిశయోక్తి కాదు. ఎన్నోవేల గీతాలు ఆలపించినప్పటికీ ఇప్పటికే ఆమె పాడిన ‘ఏ మేరే వతన్ కే లోగో’ అనే పాట ప్రతిఏటా రిపబ్లిక్ డే–జనవరి 26, ఆగస్ట్ 15న నిర్విరామంగా వినిపిస్తూనే ఉంటుంది. ఎస్డీ బర్మన్, ఆర్డ బర్మన్, మదన్ మోహన్, శంకర్ జై కిషన్ వంటి ప్రముఖ సంగీత కారులతో కలిసి ఎన్నో గేయాలను ఆలపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీత ప్రపంచంలో ఈమె గానానికి, స్వరానికి మించిన మరో స్వరం లేదనే వాదన వినిపిస్తుంది. అటు పాత తరం, ఇటు కొత్తతరం నటీమనుల కోసం కూడా ఎన్నో గానాలు ఆలపించారు. లతా మంగేష్కర్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈమెకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, ఫిల్మ్ ఫేర్ అవార్డులను బహూకరించింది. లతా మంగేష్కర్ (92) 2022 ఫిబ్రవరి 6న కన్నుమూశారు.