తమిళాభివృద్ధి కోసం ఏం చేశారు?
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

రాజకీయ దురుద్దేశ్యంతోనే ఆరోపణలు
ప్రజల ముందు పప్పులు ఉరకబోవు
డీ లిమిటేషన్ లో సీట్లు తగ్గవు
నూతన విద్యా పాలసీతో స్థానిక భాషలోనే ఉన్నత విద్యకు అవకాశం
స్టాలిన్ అవాస్తవాలు చాలించాలి
నా తెలంగాణ, హైదరాబాద్: ఐదేళ్లుగా తమిళ భాష అభివృద్ధి కోసం డీఎంకే సీఎం స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నిలదీశారు. శనివారం బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల పరిశీలన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం చెప్పారు. ఎ, బీ, సీ, డీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. దక్షిణ భారత ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వారు కారని, మీ పప్పులు ఉడకబోవని ఎద్దేవా చేశారు. ప్రజలు చైతన్యవంతులయ్యారని అన్నారు. డీ లిమిటేషన్ లో సీట్లు తగ్గబోవని పునరుద్ఘాటించారు. ఇంకా జనాభా గణన జరగాల్సి ఉందని, ఆ తరువాత నియమ నిబంధనల రూపకల్పన అనంతరం నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. దురుద్దేశ్యంతోనే స్టాలిన్ ఈ నిర్ణయాలను తెరపైకి తీసుకువస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మోదీ నేతృత్వంలో తీసుకువచ్చిన నూతన విద్యా పాలసీ ద్వారా స్థానిక భాషలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత చదువులు కూడా స్థానిక భాషల్లోనే విద్యనభ్యసించే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఎవరిపై ఏ భాషలను రుద్దడం లేదని, స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇస్తుందన్న విషయాన్ని స్టాలిన్ మరిచినట్లున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్నారు.
త్రిభాష సిద్ధాంతం కొత్తది కాదు..
తమిళభాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ అవుతూ.. నిర్మాతలు వందల కోట్లు సంపాదిస్తున్నారని, ఉత్తరాది ప్రజలు కూడా దక్షిణాది చిత్రాలను ఆదరిస్తున్నారని అన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, యూపీ, బిహార్ లాంటి అనేక రాష్ర్టాల వారు తెలంగాణ అభివృద్ధిలో చెమటోడుస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో త్రిభాష పాలసీ కొత్తది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటి నుంచి ఉందని, ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకునేందుకు డీఎంకే ఎం సాధించలేదని చెప్పుకోలేకే ఈ రెండు అంశాలను తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ దురుద్దేశ్యం ఉందని ఆరోపించారు. ఫ్రాన్స్, చైనా, జపాన్ లాంటి వారు కూడా వారి వారి భాషల్లో అంతర్జాతీయ సభల్లో ప్రసంగిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం స్టాలిన్ అవాస్తవాలను మాట్లాడటం కట్టిపెట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.