సీఎంలలోనే మార్పు.. పాలనలో లేదు
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆగ్రహం

మెదక్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసాల చిట్టా వివరణ
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించాలి
ఎన్నికల అనంతరం ప్రభుత్వం మెడలు వంచే ఉద్యమబాటకు శ్రీకారం
నా తెలంగాణ, మెదక్: సీఎంలు మారారే గానీ తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పు లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను మేధావులు గెలిపించి సత్తా చాటాలన్నారు. ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై ఉద్యమబాటలో పయనిస్తామన్నారు. అనేక రాష్ర్టాల్లో మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుందో చూస్తున్నారని చెప్పారు. కర్ణాటక, హిమాచల్, తెలంగాణలో అవినీతి, అక్రమ ప్రభుత్వాల చేతకాని విధానాల వల్ల కనీసం జీతాలివ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీల మాట దేవుడెరుగు, కనీస హామీలను కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో 14 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను అప్పులకుప్పగా మార్చాయని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు.
దశ, దిశను సూచించే ఎన్నికలు..
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర దశ దిశను సూచించే ఎన్నికలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ లో శుక్రవారం ఉదయం ఉపాధ్యాయులతో జరిగిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగిస్తూ బీఆర్ ఎస్, కాంగ్రెస్ విధానాలను తూలనాడారు. మేధావులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి రూ. 4వేలు, మహిళలకు రూ. 2500, ప్రతీ దళిత కుటుంబానికి రూ. 12 లక్షలు, రైతులు, రైతు కూలీలకు ఆదుకుంటామన్న హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హామీలిచ్చి ఇప్పుడు వారిని కనీసం కలవడం కూడా లేదని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చినవి, చేసినవన్నీ మోసపూరిత హామీలేనని, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకేం లేవన్నది తేలిపోయిందని కేంద్రమంత్రి విమర్శించారు.
దివాళా తీసిన ఆర్థిక పరిస్థితి ..
తెలంగాణలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసిందని, ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఐదు డీఏలపై మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ర్టాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని అదే దిశలో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలు, అహాంకారపూరిత చర్యలు, అధికార దుర్వినియోగం తప్ప ఇరు ప్రభుత్వాల పాలనలో మార్పు ఏమీ లేదన్నారు. మార్పు వచ్చిందంటే కేవలం కేసీఆర్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కుటుంబాల్లోనే వచ్చిందని విమర్శించారు. రాష్ర్టాన్ని గాడిన పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
ప్రజాతీర్పు బీజేపీ వైపే..
ఈ శాసనమండలి ఎన్నికల్లో ప్రజల తీర్పు కాంగ్రెస్ వైఫల్యానికి వ్యతిరేకంగా రానుందని బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఈ మార్పులో విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు కీలక పాత్ర పోషించి మోదీ ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకోవాలని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంతో తమ పార్టీకి మరింత మద్ధతు లభిస్తుందని దీంతో మరింత బలపడి ప్రభుత్వాల మెడలు వంచే ఉద్యమబాటలో పయనిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.