ఆహ్వానం ఆలస్యం.. హాజరుకాలేం
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

సమావేశాల ఆహ్వానాలు ముందే అందాలి
అప్పుడే అర్థవంతమైన చర్చకు ఆస్కారం
మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి రూ. 10 లక్షల కోట్లు
భవిష్యత్ లోనూ చిత్తశుద్ధి, అంకితభావంతో సేవ చేస్తాం
నా తెలంగాణ, హైదరాబాద్: ఎంపీల సమావేశానికి ఆహ్వానం ఆలస్యంగా అందినందున, పార్టీ పరంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ముందే నిర్ణయించడం వల్ల సమావేశానికి హాజరు కావడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎంపీల సమావేశానికి బీజేపీ పార్టీకి ఆహ్వానం అందించారు. ఈ ఆహ్వానలేఖ శుక్రవారం రాత్రి పార్టీకి అందింది. దీనిపై శనివారం ఉదయం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేస్తూ సమాధానం ఇచ్చారు.
కీలక సమావేశాలపై అర్థవంతమైన చర్చకు తగిన సమయం అవసరమవుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రజాప్రతినిధులందరికీ ముందుగానే ఆయా కార్యక్రమాల షెడ్యూల్ ఉందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సమావేశాలకు సంబంధించిన ఆహ్వానాల లేఖలను కాస్త ముందుగానే అందిస్తే బాగుంటుందని ఆశించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రూ. 10 లక్షల కోట్లు రాష్ర్ట అభివృద్ధికి ఖర్చు చేశామని, ఇకముందు కూడా ఇదే చిత్తశుద్ధి, అంకితభావంతో కృషి చేస్తూనే ఉంటామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.