సంఘర్షణ కాదు.. సమన్వయమే విధానం

పాడ్​ కాస్ట్​ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

Mar 16, 2025 - 18:51
Mar 16, 2025 - 18:52
 0
సంఘర్షణ కాదు.. సమన్వయమే విధానం

పాక్​ కుసద్భుద్ధిని ప్రసాదించాలి
140 కోట్ల భారతీయులదీ శాంతిమార్గమే
మానవాళి పునాదుల రక్షణ పర్యావరణ పరిరక్షణ, శాంతి విధానంతోనే సాధ్యం

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​ విధానం సంఘర్షణ కాదని, సమన్వయంతో శాంతియుతంగా ముందుకు వెళ్లడమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. పాక్​ కు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరారు. తాను ప్రపంచదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులేదే అన్నారు. ఖచ్చితంగా భారతీయులంతా శాంతిమార్గంలో, అభివృద్ధి పథంలో నడవాలనే కోరకుంటున్నారని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు నేటివి కావని వేల సంవత్సరాలవన్నారు. వాటితో భారతీయులు నేర్చుకున్న విధానాలకే ప్రపంచదేశాలు ఇప్పటికీ గౌరవం ఇస్తున్నాయని తెలిపారు. తాను ఏ దేశంలోకి వెళ్లి శాంతి ప్రస్తావన తీసుకువచ్చినా అది తనది కాదని 140 కోట్ల భారతీయుల విధానమని చెప్పారు. ఇందుకు ప్రపంచదేశాలు కూడా శాంతివిధానంపై ఆసక్తిని కనబరుస్తున్నాయని తెలిపారు. అంత గొప్ప సంస్కృతి భారత్​ ది అన్నారు. తమకు పేదరికం పెద్ద సమస్య కాదన్నారు. ఆ పేదరికం నుంచి పుట్టిన ఆలోచనలే శాంతి, పర్యావరణ పరిరక్షణ, మానవాళి జీవితానికి పునాదులను గ్రహించగలిగామన్నారు. నేడు ఆ పేదరికం నుంచి బయటపడుతున్నా, ప్రపంచ మానవాళితో కూడా శాంతి విధానాన్నే భారత్​ కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. 

ప్రపంచ ప్రఖ్యాత పాడ్​ కాస్ట్​ లెక్స్​ ఫ్​రిడ్​ మాన్​ తో తొలిసారిగా అత్యంత ఎక్కువ సమయం ప్రధాని మోదీతో జరిగిన మూడు గంటల ఇంటర్వ్యూలో అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని ఎన్నో విషయాలను, వివరాలను కూలంకషంగా పంచుకున్నారు. 

ప్రపంచం వింటోంది..
తన బలం 140 కోట్ల మంది భారతీయులే అన్నారు. దేశ సంస్కృతి, వారసత్వం తమలో ఉందన్నారు. నేడు భారత్​ శాంతి విధానాలపై మాట్లాడితే  ప్రపంచం వింటోందన్నారు. బుద్ధుడు, మహాత్మాగాంధీ లాంటి వారు ప్రపంచానికి అందించిన మహత్తర సందేశం శాంతి అన్నారు. సంఘర్షణలతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. సంఘర్షణ అనేది భారత్​ విధానమే కాదన్నారు. సమన్వయంతో ముందుకు వెళ్లడమే తమ విధానమని కుండబద్ధలు కొట్టారు. 

ఇప్పటికైనా పాక్​ విధానంలో మార్పు రావాలి..
తాను అధికారం చేపట్టే కార్యక్రమంలో ప్రపంచదేశాలతోపాటు పాక్​ ను కూడా ఆహ్వానించానని, కానీ పాక్​ హాజరుకాలేదన్నారు. వారికి సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాక్​ ను హృదయ పూర్వకంగా ఆహ్వానించినా శత్రుత్వం, ద్రోహమే తమకు లభించిన సమాధానాలని చెప్పారు. పాక్​ సంఘర్షణ విధానంతో ఆ దేశ ప్రజలు కూడా తీవ్ర దుర్భిక్షంలో జీవనాన్ని ఈడుస్తున్నారని ఇది దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా పాక్​ విధానంలో మార్పు చోటు చేసుకోవాలని, అక్కడి ప్రజలు కూడా సుఖశాంతులతో, అభివృద్ధి నినాదంతో ముందుకు సాగాలని, జీవితాలను సుఖమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. 

భారతీయుల ఆకాంక్షలతోనే ముందుకు..
తనపై వస్తున్న విమర్శలను స్వాగతిస్తానని అన్నారు. తన జీవితంలో ఎత్తుపళ్లాలను చవిచూశాను కాబట్టే ప్రపంచాన్ని శాంతిమార్గంలో ముందుకు తీసుకువెళదామని సంకల్పించానని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలతో భవిష్యత్​ లోనూ ముందుకు వెళతానని స్పష్టం చేశారు. ఆరోపణలు, విమర్శలు అభిమానుల ఆశల ముందు పటాపంచలైపోతాయని స్పష్టం చేశారు. తన బాల్యం పేదరికంలో గడిచిందని, వేసుకోవడానికి సరైన వస్ర్తాలు, చెప్పులు కూడా లేకపోయేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో సుద్ధముక్కలు, చెక్కబోర్డులపై రాస్తూ విద్యనభ్యసించానని చెప్పారు. 

క్రీడలతో భౌగోళిక ఉద్రిక్తతలూ దూరం..
ప్రపంచంలోని యువత క్రీడల్లో బాగా రాణిస్తున్నారని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కువగా ఆదరణ పొందిన క్రీడల్లో ఫుట్​ బాల్​,క్రికెట్​, హాకీ తదితర క్రీడల్లో సత్తా చాటుతున్నారని కొనియాడారు. మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, మారడోనా, పీలే, జినెడిన్​ జిదానే లాంటి పేర్లు ఇప్పటికే భారత్​ లో వినిపిస్తుంటాయని, వారికీ అశేష సంఖ్యలో భారత్​ లోనూ అభిమానులున్నారని చెప్పారు. భారత్​ లోనూ మినీ బ్రెజిల్​ ఉందని తనకూ ఈ మధ్యే తెలిసిందన్నారు. యువతలో ఇలాంటి క్రీడలు మానసిక స్ఫూర్తిని నింపుతాయని పేర్కొన్నారు. అంతటి క్రీడాస్ఫూర్తి భారత్​ లోనూ ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు మోదీ చెప్పారు. క్రీడాస్ఫూర్తి అనేది భౌగోళిక ఉద్రిక్తతలను కూడా తగ్గించి ప్రజలను ఒక్కటిగా చేరుస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఆటలు ప్రజలను లోతైన బంధాలతో ముడిపెడతాయన్నారు. 

ఉపవాసం విడదీయరాని సంస్కృతిలో భాగమే..
తాను భారత్​ లో పుట్టిపెరిగానని, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల అలవాట్లు తనలోనూ అణువణువునా ఉన్నాయన్నారు. ఉపవాసం అనేది భారతీయ సంస్కృతితో విడదీయరాని భాగమన్నారు. తాను కూడా ఉపవాస దీక్షను చేస్తానని చెప్పారు. అమెరికాలో ఒబామాతో కలిసినప్పుడు ఉపవాస దీక్షలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. కేవలం వేడినీళ్లను మాత్రమే తీసుకున్నానని చెప్పారు. 

నిరంతరం దాడులు దురదృష్టకరం..
2002కి ముందు దేశంలో నిరంతరం ఉగ్రవాద దాడులతో అస్థిరత వాతావరణం ఉండేదన్నారు. గుజరాత్​ అల్లర్లు, 1999లో కాందహార్​ విమానం హైజాక్​, 2000లో ఎర్రకోటపై దాడి, 9/11 అమెరికాపై ఉగ్రాదాడి, జమ్మూకశ్మీర్​ అసెంబ్లీ, భారత పార్లమెంట్​ పై దాడులు ఇలా అనేక సంఘటనలు భారత్​ పై తీవ్ర ప్రభావాన్నే చూపాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టాక కూడా అనేక విమర్శలు, ఆరోపణలు తనను చుట్టుముట్టాయన్నారు. ఆ సమయంలోనూ హింస పలు ప్రాంతాల్లో చోటు చేసుకుందన్నారు. 2002కి ముందు గుజరాత్​ లో 250కి పైగా అల్లర్లు జరిగాయని ఇవి దేశ శాంతికి భంగం వాటిల్లేలా చేయడం విషాదకరమని అభివర్ణించారు. తనపై అనేక ఆరోపణలు వచ్చిన తన విధానం, తీరు వల్ల అవన్నీ వీగిపోయాయని తెలిపారు. భారత అత్యున్నత న్యాయవ్యవస్థ కూడా తనను నిర్దోషిగా ప్రకటించిందని చెప్పారు. అదేసమయంలో నిజమైన దోషులకు శిక్ష పడిందన్నారు. 

భారత్​ వైపు మొగ్గుచూపుతున్న దేశాలు..
ఒక సమయంలో భారతదేశ విధానం పట్ల మొగ్గుచూపని దేశాలు నేడు తమ విధానాలను అవలంబించేందుకు ముందువరుసలో ఉంటున్నాయని ఇది సంతోషకరమని చెప్పారు. భారతీయుల గొప్ప ప్రయత్నానికి నిదర్శనమన్నారు. పాక్​ కూడా ఇదే దిశలో పయనించాలని అనేకసార్లు కోరుకొని హస్తం అందజేసినా శత్రుత్వ విధానమే ఎదురైందన్నారు. దీంతో ఆ దేశ ప్రజలు కూడా విసిగి వేసారని పోయారని అన్నారు. ఆ దేశ ప్రజలు దుర్బిక్ష పరిస్థితుల్లో బ్రతకడం దురదృష్టకరమని మోదీ చెప్పారు.

లెక్స్​  ఫ్రీడ్​ మాన్..
ప్రధాని నరేంద్ర మోదీని మూడు గంటలపాటు సుధీర్ఘ ఇంటర్వ్యూ చేసిన లెక్స్​  ఫ్రీడ్​ మాన్..​ 1983 ఆగస్ట్​ 15న రష్​యాలో జన్మించారు. ఆ తరువాతి కాలంలో చికాగోలో స్థిరపడ్డారు. ఇల్లినాయిస్​ లో విద్యనభ్యసించారు. బయోమెట్రిక్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి ఫ్రైడ్‌మాన్ గూగుల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆరు నెలల తర్వాత, అతను ఉద్యోగం మానేశాడు. తరువాత అతను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిగ్-డేటా విశ్లేషణలపై ఏఐ రంగంపై పరిశోధన శాస్త్రవేత్తగా చేరాడు.

డోనాల్డ్​ ట్రంప్​, బెంజమిన్​ నెతన్యాహు, అర్జెంటీనా పీఎం జేవియర్​, ఎలన్​ మస్క్​, జుకర్​ బర్గ్​, బెజోస్​ తదితర ప్రముఖుల ఇంటర్వ్యూలను చేసి ప్రసిద్ధి పొందాడు. 2018లో ఎంఐటీలో పరిశోధన శాస్ర్తవేత్తగా పనిచేస్తున్నప్పుడు తన తొలిపాడ్​ కాస్ట్​ ను ప్రారంభించాడు.