ఆధార్​, ఓటర్​ ఐడీ లింక్​!

సీఈసీ ప్రధానాధికారి జ్ఞానేష్​ కుమార్​ ఉన్నతస్థాయి సమావేశం

Mar 16, 2025 - 22:16
 0
ఆధార్​, ఓటర్​ ఐడీ లింక్​!

మార్చి 18న సాధ్యాసాధ్యాలపై విస్తృత చర్చ
టీఎంసీ, కాంగ్రెస్​, ప్రతిపక్షాలకు సమాధానం
ఏప్రిల్​ 30 వరకు పార్టీల సూచనలు, సలహాలు సేకరణ
బాధ్యతలు ఐపీపీబీ లకే?

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: ఆధార్​, ఓటర్​ ఐడీ లింక్​ అనుసంధానించడంపై ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్​ కుమార్​ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చి 18న హోంమంత్రిత్వ శాఖ, న్యాయమంత్రిత్వశాఖ, యూఐడీఎఐ అధికారులతో భేటీ కానున్నారు. సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2021 సవరించినప్పటి నుంచి స్వచ్ఛందంగా ఆధార్​ నంబర్​ లను అందించిన ఓటర్లను ఈసీఐ సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇంకా వీటిని లింక్​ చేయలేదు.

మూడు నెలల్లోపే కొత్త నెంబర్లు జారీ..
ఓటరు జాబితాల్లో తప్పులు నివారించేందుకు, నకిలీ ఓటర్ల గుర్తింపు, తొలగింపు ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలతోపాటు అమలు, సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్​ తోపాటు ఇతర రాష్ర్టాల్లో ఉన్న నకిలీ ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులు, నంబర్​ లకు సంబంధించి టీఎంసీ (తృణమూల్​ కాంగ్రెస్​) ఫిర్యాదుల నేపథ్యంలో కూడా ఈ సమావేశం కీలకం కానుంది. ఆల్ఫాన్యూమరిక్​ సిరీస్​ లోని లోపాల కారణంగా కొంతమంది రాష్ర్ట ఎన్నికల అధికారులు తప్పుగా నకిలీ నంబర్​ లను జారీ చేశారని ఈసీఐ గుర్తించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు నకిలీ ఓటరు నంబర్లు ఉన్నవారికి అర్హత ప్రకారం కొత్త నంబర్లను మూడు నెలల్లోపే కేటాయిస్తామని కూడా ఇటీవలే అధికారులు ప్రకటించారు.

ప్రతిపక్షాల ప్రశ్నలు..
కాగా ఎపిక్​ నంబర్​ లు నకిలీ ఓటర్ల ఉనికిని సూచించవని, వాస్తవ ఓటర్లు వారి వారి నియోజకవర్గాల్లోనే ఓటు హక్కును వినియోగించుకో గలరని ఈసీ స్పష్టం చేసింది. మార్చి 6న ఓట్లలో వ్యత్యాసాలను, నకిలీ ఓట్లను, పేర్ల తొలగింపు, చేరికలు తదితర అంశాలను పరిష్కరించాలని టీఎంసీ ఈసీని కోరింది. మార్చి 10న పార్లమెంట్​ లోనూ ఈ అంశాన్ని టీఎంసీ లేవనెత్తింది. కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ కూడా ఈ అంశంపై పలు ప్రశ్నలు సంధించారు. 

శాశ్వత పరిష్కారానికి సీఈసీ చర్యలు..
ఈ నేపథ్యంలో ఈసీ శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమం చేసేందుకు మార్చి 18న ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశం అనంతరం నకిలీ ఓటర్లు, పేర్ల తొలగింపు, ఓటర్ల చేరికపై ఉన్న సందేహాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించనుంది. కాగా పలు పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలపై ఈసీ అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు, సూచనలు ఏప్రిల్​ 30వ తేదీ వరకు అందించాలని కోరింది. ఆయా సూచనలు, అభిప్రాయాలు, సలహాలు ఈఆర్​వో (ఎలక్టోరల్​ రిజిస్ర్టేషన్​ ఆఫీసర్లు), జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవో), చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్లు (సీఈవో)స్థాయిలలోని సమస్యలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలోని పేర్లు, అడ్రస్​ మార్పులు, చేరికలు, తొలగింపులపై వారి వారి అభిప్రాయాల మేరకు మాత్రమే గుర్తింపు కార్డులలో సరిద్దాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ర్టాలకు స్పష్టం చేసింది.

ఐపీపీబీకి కేటాయిస్తేనే పూర్తి స్పష్టత..
ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్​ తో ఓటరు కార్డు అనుసంధానం, గ్రామీణ, నగర స్థాయిల్లో చేపడితే చాలామేరకు ఓట్ల లెక్కల్లో స్పష్టమైన గణాంకాలు వెల్లడవుతాయి. అదే సమయంలో నకిలీల బెడద నివారించొచ్చు. ఈ నేపథ్యంలో మరో అంశం కూడా తెరపైకి వస్తుంది. ఓటర్ల చేరికలు, తొలగింపులు, తప్పులు సరిదిద్దే అవకాశం పోస్టాఫీస్​ డిపార్ట్​ మెంట్​ (ఐపీపీబీ–ఇండియన్​ పోస్ట్​ పేమెంట్ బ్యాంకు) కు ఇస్తే మంచిదనే వాదన తెరపైకి వస్తుంది. ప్రతీ నగరంలోనూ, గ్రామంలోనూ పోస్టాఫీసులు ఉండడంతో సులభంగానే ఆయా గ్రామాల్లో, వార్డులు, మండలాలు, జిల్లాలు, నగరాల్లో ఉండే ఓటర్ల వివరాల్లో పూర్తి స్పష్​టత వస్తుంది. మరి మార్చి 18న జరిగే సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం, అనంతరం ఆయా పార్టీల సూచనలు, సలహాలు, అనంతరం తుదినిర్ణయంలో ఏ మేరకు సక్సెస్​ సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే.