చెరసాలలో ‘ఆమె’ సంఖ్య రెట్టింపు
The number of 'her' in prisons has doubled

సత్తా చాటుతున్న తరుణంలో కేసుల సంఖ్యలోనూ పెరుగుదల
ఏటా పెరుగుతున్న గణాంకాలు
పేదరికం, నిరాదరణ, పనిభారం, ఆర్థిక సమస్యలతో సతమతం
స్వల్పకారణాలకే తొందరపాటు నిర్ణయాలూ జైలు జీవితానికి కారణాలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మహిళా లోకం ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా బలోపేతం అవుతూ.. సత్తా చాటుతోంది. మరోవైపు ‘ఆమె’పై ఆరోపణలు, అఘాయిత్యాలు, వేధింపులు, కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తుంది. కారణాలు ఏవైనా ‘ఆమె’పై ‘పీనల్ రిఫార్మ్ ఇంటర్నేషనల్, ఉమెన్ బియాండ్ వాల్స్’ గణాంకాల ప్రకారం పురుషులతో సుమారుగా సమానమైన కేసులు నమోదవుతున్నాయి. జైలు శిక్షను అనుభవిస్తున్నారు. పేదరికం, బాలికలు, మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి, కుటుంబ సభ్యులు, సమాజం చిన్నచూపు, తొందరపాటు నిర్ణయాలు వారి జీవితాలను మరోమారు అగాధంలోకి నెట్టేలా గణాంకాల లెక్కలతో స్పష్టం అవుతుంది. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పనిప్రదేశాలు, కుటుంబంలో నిరాదరణ, పనిభారం ఎక్కువ కావడం, ఆర్థిక సమస్యలు, పేదరికం, దీనికి తోడు భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యత తదితర కారణాలతో భారీ ఒత్తిళ్లకు లోనవుతున్నారు. దీంతో స్వల్ప కారణాలకే కొంతమంది మహిళలు ఆవేశపూరిత, తొందరపాటు నిర్ణయాలతో వారి జీవితాల్లో చీకట్లు నింపుకుంటున్నారు.
ప్రధానకారణం ఏంటీ?..
ఇప్పటికే పాశ్చాత్య (ఫారిన్ కంట్రీస్) దేశాల్లో ‘ఆమె’కు పురుషుడితో సహా సమాన హక్కులు ఉండడంతో అన్ని రంగాల్లోనూ స్వేచ్ఛ సమకూరుతుంది. ఈ స్వేచ్ఛే ఆమె పాలిట యమపాశమవుతోంది. పలు దేశాల్లోనైతే యథేచ్ఛగా ఆమెను స్వేచ్ఛ పేరుతో ఉగ్రకార్యకలాపాలకు కూడా ఉసిగొల్పడం విచారకరం. అంతర్జాతీయంగా మహిళల రక్షణ కోసం పలు దేశాల్లో పటిష్ఠమైన చట్టాలున్నప్పటికీ కుటుంబ కేసుల్లో ఆమెకు ‘ఆమె’ శత్రువుగా నిలుస్తున్నట్లు కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భార్య వేధింపబడితే అత్తా, మామలతోపాటు ఆడపడుచులపై కూడా కేసులు అనేకమే నమోదవుతున్నాయి. ఇది ‘ఆమె’ జైలు జీవితానికి ఒక ప్రధాన కారణభూతంగా నిలుస్తుంది.
57 శాతం పెరిగింది..
ఆర్థిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,33,000 కంటే ఎక్కువ మంది మహిళలు జైళ్లలో మగ్గుతున్నారు. ఈ సంఖ్య పురుషుల కంటే వేగంగా పెరగడం ఆందోళనకు కారణమవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఈ సంఖ్య రెట్టింపవుతుంది. జైలులో ఉన్న మహిళలు, బాలికల సంఖ్య 57శాతం పెరగడం శోచనీయం. ఇది పురుషుల జైలు జనాభాలో 22శాతం పెరుగుదలను సూచిస్తుంది. జైలు జీవితాలను అనుభవిస్తున్న వారిలో ఎక్కువగా ఆర్థిక నేరాలు, కుటుంబ వివాదాలు, భిక్షాటన, దొంగనాలు, వేధింపులు, హత్యలు లాంటి తీవ్ర నేరాల్లో కూడా శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు ప్రతీయేటా మహిళలకు క్షమాభిక్ష లాంటి వాటిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సమాజంలో సాధారణ జీవితానికి పరిస్థితులను కల్పిస్తున్నారు. అయినా ప్రతీఏటా నేరాల్లో ఆమె సంఖ్య పెరగడం ఆందోళనకలిగిస్తుంది.
పిల్లల బాల్యంపై ప్రభావం..
నేరాలు చేసిన వారు జైలు జీవితం గడపడం చట్టరీత్యా సరైనదే అయినప్పటికీ గర్భిణులుగా జైలు జీవితం అనుభవిస్తూ పిల్లలను కని వారిని కూడా జైలులోనే పోషించుకోవడం దుర్భర పరిస్థితిని చాటిచెబుతుందనే వాదనలూ అనేకం ఉన్నాయి. జైలు జీవితం ఇలాంటి నవజాత శిశువులు, అభం, శుభం తెలియని పిల్లల బాల్యంపై తీవ్ర ప్రభావం చూపి, భవిష్యత్ లో వారి ఆవేశకావేశాలకు, భావోద్వేగాలకు అభిప్రాయాలలో మార్పులకు కారణమవుతుంది.
ఏది ఏమైనా స్ర్తీ జీవితానికి స్వేచ్ఛనందిస్తున్నామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ‘ఆమె’కు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రపంచదేశాల ప్రభుత్వాలు ‘ఆమె’ సురక్షితానికి మాత్రం భరోసాను అందించలేక చతికిలపడుతున్నాయి.