బేగంపేట్​ రైల్వే స్టేషన్​.. మహిళలకే అంకితం

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Mar 15, 2025 - 12:38
 0
బేగంపేట్​ రైల్వే స్టేషన్​.. మహిళలకే అంకితం

ఆధునీకరణ పనుల పరీశీలన
అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫే
అప్రోచ్​ రోడ్లపై త్వరగా  నిర్ణయం తీసుకోవాలి
రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి సూచన
ఆధునీకరణలో ధీటుగా తెలంగాణ రైల్వే స్టేషన్ల రూపకల్పన

నా తెలంగాణ, హైదరాబాద్​: తెలంగాణ రైల్వేల సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రజలు, ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్​ పూర్తిగా మహిళా లోకానికి అంకితం చేయనున్నామని శుభవార్త వినిపించారు. అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నామని స్పష్టం చేశారు. బేగంపేట, చర్లపల్లి, మేడ్చల్​, యాకత్​ పురా, నాంపల్లి, కాచిగూడ, ఉందానగర్​ ఇలా అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంగీకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా రైల్వే స్టేషన్లకు అప్రోచ్​ రోడ్లకు స్థలాలను అందిస్తే బాగుంటుందన్నారు. కేంద్రం ఆధునీకరించబోయే రైల్వే స్టేషన్లన్నీ ఎయిర్​ పోర్టుల మాదిరి అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. 

శనివారం బేగంపేట రైల్వే స్టేషన్​ లో ఆధునీకరణ పనులు ఏ మేరకు కొనసాగుతున్నాయనే దానిపై ఆరా తీశారు. స్టేషన్​ ప్రాంగణంలో పర్యటించి, పలు రకాల పనుల తీరును పర్యవేక్షిస్తూ అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు. 

రూ. 26 కోట్లతో తొలివిడత త్వరలో పూర్తి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. బేగంపేట రైల్వే స్టేషన్​ తొలివిడత పనులు పూర్తయ్యాయని, మరో 5 నుంచి 10 శాతం సుందరీకరణ పనులు మాత్రమే జరగాల్సి ఉందన్నారు. రూ. 26 కోట్లతో తొలి విడత పనులు పూర్తి చేయనున్నామని, ఆ వెంటనే రూ. 12 కోట్లతో రెండో విడత పనులను కూడా చేపడతామని కేంద్రమంత్రి వివరించారు. పనులు నిర్వహించే సమయంలో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ రైల్వే స్టేషన్​ ను మహిళా లోకానికి అంకితమివ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారన్నారు. ఈ రైల్వేస్టేషన్​ లో సెక్యూరిటీ గార్డుల నుంచి అధికారుల వరకు అందరూ మహిళా ఉద్యోగులే ఉండనున్నారని మంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలో రైల్వే స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు, సుందరీకరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. 

రాష్ర్టానికి కవచ్​ ఇన్​ స్టిట్యూట్​..
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం రూ. 5,337 కోట్ల రూపాయలతో ఆధునీకరణ, రూ. 39,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైల్వే లైన్ల డబ్లింగ్​, నూతన ట్రాక్​ ల నిర్మాణం, నాలుగు లైన్లుగా మార్చడం లాంటి పనులు ఉన్నాయని తెలిపారు. సికింద్రాబాద్​ కు కవచ్​ సాంకేతికతను తీసుకువచ్చే రీసెర్చ్​ ఇన్​ స్టిట్యూట్​ కు కూడా కేంద్రం ఓకే చెప్పిందన్నారు. ప్రపంచంలోనే రైళ్ల భద్రతపై నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కవచ్​ ఇక్కడకు రావాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. ప్రపంచంతో పోటీ పడే సాంకేతిక వ్యవస్థే కవచ్​ అన్నారు. ఈ వ్యవస్థ ఇప్పటికే పైలెట్​ ప్రాజెక్టుగా పలు ప్రాంతాల్లో విజయవంతం అయ్యిందని, ప్రస్తుతం తెలంగాణకు రాబోతుందని హర్షం వ్యక్తం చేశారు. 

రైల్వే క్రాసింగ్​ ప్రమాదలుండవు..
తెలంగాణలో రైల్వే క్రాసింగ్​ ల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక రాష్ర్ట వ్యాప్తంగా 453 అండర్​ పాస్​ లు, ఫ్లై ఓవర్లు నిర్మించామన్నారు. ఇప్పటికే ఐదు వందేభారత్​ లు తెలంగాణకు తీసుకువచ్చిమని తెలిపారు. 

నగరంపై భారం తగ్గిస్తాం.. చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు నడుపుతాం..
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ రూ. 715 కోట్లతో తొలివిడత ఆధునీకరణ పనులు వచ్చేఏడాదినాటికి పూర్తి అవుతాయని చెప్పారు. తొలివిడత పూర్తయ్యాక మలివిడత పనులను చేపడతామన్నారు. రూ. 327 కోట్లతో నాంపల్లి స్టేషన్​ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని రాష్ర్ట ప్రభుత్వం ఆయా రైల్వే స్టేషన్లలో అప్రోచ్​ రోడ్​ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్​ అప్రోచ్​ రోడ్డుపై నిర్ణయం తీసుకుంటే త్వరగా పనులు పూర్తి అవుతాయన్నారు. ఇక్కడి నుంచి ఇప్పటికే అనేక రైళ్లు నడిపిస్తున్నారని, భవిష్యత్​ లోనూ నగరంపై భారం పడకుండా ఇక్కడి నుంచే రైళ్లను నడపాలనే ప్రణాళికలు ఉన్నాయని జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.