సీపెక్ డ్రాగన్ యూటర్న్
Seapec Dragon U-turn

కుప్పకూలనున్న పాక్ ఆర్థిక వ్యవస్థ
తమను తామే కాపాడుకోలేని ఆర్మీ ప్రాజెక్టులను ఏం కాపాడుతుందంటున్న చైనా
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: పాకిస్థాన్ లో బీఎల్ ఎ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) భారీ వరుస దాడులకు తెగబడడం ఆ దేశా ఆర్థిక వ్యవస్థను మరోసారి అగాధంలోకి నెట్టింది. వరుసదాడులపై చైనాకు చెందిన సీపెక్ (సీపీఈసీ–చైనా పాక్ ఎకనామిక్ కారిడార్)లో పెట్టుబడులను నిషేధించాలని చైనా నిర్ణయించినట్లు రక్షణ శాఖనిపుణుడు ఒకరు పేర్కొన్నారు. అంటే పెట్టుబడులపై డ్రాగన్ యూటర్న్ తీసుకుంది. దీంతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినట్లయ్యింది. ఈ ప్రాజెక్టుపై పాక్ భారీ ఆశలు పెట్టుకుంది. సజావుగా ప్రాజెక్టు కొనసాగించేందుకు 40వేల మంది ఆర్మీ సిబ్బందిని కూడా మోహరించింది. కానీ గత ఐదు రోజులుగా పాక్ లో ఆర్మీపై జరుగుతున్న దాడుల పరిస్థితులను చైనా రక్షణ శాఖ నిశితంగా గమనిస్తుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులను నిలిపివేయాలని నిర్ణయించింది.
తనను తానే సురక్షితంగా ఉంచుకోలేకపోతే భారీ పెట్టుబడులతో చేపడుతున్న సీపెక్ ప్రాజెక్టును ఎలా సురక్షితంగా ఉంచగలుగుతారని భావిస్తుంది. బలూచ్ ప్రాంతం గుండానే ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ దారి గుండానే చైనా కార్మికులు, ఇంజనీర్లు, ప్రముఖ అధికారులు రాకపోకలు కొనసాగిస్తూ పనులను చేపడుతున్నారు. బలూచ్ దాడులతో డ్రాగన్ ప్రాజెక్టు నిర్మాణంపై వెనక్కు తగ్గింది.
హింస పూర్తిగా తగ్గిపోయి, బీఎల్ ఎను పాక్ నిరోధించే వరకు, శాంతి కొనసాగే వరకూ ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టుకైనా నిధులను నిలిపివేయాలని చైనా రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీపెక్ ప్రాజెక్టు చేపడుతున్న తొలుతలో చైనా మేకపోతు గాంభీర్యంతో పాక్ కు మనోధైర్యాన్ని అందించింది. ఒత్తిడి, ఆర్థికంతో పరిస్థితులను చక్కదిద్దాలని సూచించింది. దీంతో పాక్ కూడా ఒకింత అడుగు ముందుకు వేసి ధైర్యంగా బలూచ్ ప్రాంతంలో సీపెక్ ప్రాజెక్టుకు ఒప్పుకొంది. ఇదే ఇప్పుడు ఆ దేశ ఆర్మీ మనోధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు కారణభూతంగా నిలుస్తుంది.
2001 నుంచి పాక్ నిరంతరం బలూచ్ ప్రాంతంలో సైనిక చర్య చేపడుతున్నా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని గత ఐదు రోజులుగా జరుగుతున్న దాడులతో తేలిపోయింది. ఈ సమయంలో నివురు గప్పిన నిప్పులా బీఎల్ ఎ కిమ్మనకుండా తన సామర్థ్యాన్ని బలోపేతం చేసుకొని తిరిగి విజృంభించింది. పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి సవాల్ విసురుతూ దాడులకు పాల్పడుతుంది.
పాక్ లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో చైనా 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అఏ సమయంలో పాక్ భద్రత కోసం 200 మిలియన్ల డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. కానీ బీఎల్ ఎ దాడులతో ఇటు పాక్, అటు డ్రాగన్ కంట్రీ ఆశలు అడియాశలైనట్లయింది.