బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లను ఎండగతాం

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Feb 15, 2025 - 13:35
Feb 15, 2025 - 14:29
 0
బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లను ఎండగతాం

నల్గొండలో ఉపాధ్యాయులతో మీట్​ అండ్​ గ్రీట్​
శాసనమండలిలో బీఆర్​ఎస్​ తూతూ మంత్రంగా సమావేశాలు
పాలకమండలికి సలాం కొట్టే విధానాలు
యూనివర్సిటీల అప్​ గ్రేడ్​ ఏది?
స్కూటీలేవి? స్కాలర్​ షిప్​ లు విడుదల చేయరా?
అన్ని వర్గాల మద్ధతు బీజేపీకే
తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యత

నా తెలంగాణ, నల్గొండ: శాసనమండలిలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తి బీఆర్​ఎస్​ తీరును ఎండగడతామని, కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీల విఫలంపై నిలదీస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో ఉపాధ్యాయులతో మీట్​ అండ్​ గ్రీట్​ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

ఎమ్మెల్సీల ప్రాధాన్యతను తగ్గించారు..
ఈ నెల 27న రెండు ఉపాధ్యాయులు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రుల విషయంలో మాట్లాడాల్సిన బీఆర్​ఎస్​ ఎక్కడా వారి సమస్యలపై ప్రస్తావించలేదన్నారు. శాసనమండలి ప్రాధాన్యతను బీఆర్​ఎస్​ పూర్తిగా తగ్గించిందని, తూతూ మంత్రంగా సమావేశాలను నిర్వహించారన్నారు. గతంలో ఎమ్మెల్సీలు అంటే ప్రభుత్వాలు హడలెత్తిపోయేవన్నారు. అందరికి అండగా ఉండే పరిస్థితి ఉండేదన్నారు. ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించారన్నారు. పాలకమండలికి సలాం కొట్టే వారి విధానాలే ఇందుకు కారణమన్నారు. మూడు స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందన్నారు. బీఆర్​ఎస్​ కు పదేళ్లలో వ్యతిరేకత, కాంగ్రెస్​ కు ఒకే సంవత్సరంలో వ్యతిరేకత వచ్చిందన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగస్థుల సంఘాలు బీజేపీ తరఫున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అండగా నిలబడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 

జాబ్​ క్యాలెండర్​ ఎక్కడా?..
కాంగ్రెస్​ పార్టీ అన్ని పత్రికల్లో తేదీల వారీగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారన్నారు. ఆ జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ పోయిందని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నారన్నారు. డీఎస్సీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్​ నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్​ గ్యారెంటీలు అమలు చేసే శక్తి, చిత్తశుద్ధి లేదన్నారు. హస్తం పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. ప్రతీ మండలంలోనూ అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, ఐదు లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నారు. అదేమైందని నిలదీశారు. ఎడ్యుకేషన్​ సెక్టార్​ కు బడ్జెట్​ ను రెండింతలు చేస్తామన్నారు. అది దిక్కుదివానం లేదన్నారు. పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల అప్​ గ్రేడ్​, ఆదిలాబాద్​, ఖమ్మంలో నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నిరుద్యోగులకు రూ. 4వేల భృతి ఇస్తామని హస్తం ముఖం చాటేసిందన్నారు. 

విద్యాలయాల్లో ఆత్మహత్యలు.. తినే తిండిలోనూ విషం..
ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు పీఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు ఒక్కరోజు ముందే అందజేస్తుందన్నారు. రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ ను ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్​ మెంట్​ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్​ అయోమయంలో పడిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల మీద కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయని అన్నారు. రూ. 8వేల కోట్లు విద్యాసంస్థలకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్​ షిప్​ లు కూడా రీయంబర్స్​ చేయలేని పరిస్థితులో ప్రభుత్వం చేతులెత్తేస్తుందన్నారు. గురుకుల విద్యాలయాల్లో ఆత్మహత్యలు పెరిగాయని, తినే తిండి విషపూరితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడని, చిన్న చిన్న పనులు కూడా చేయలేక చేతులెత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ, మహిళలకు రూ. 2వేలు ఏమైందని నిలదీశారు. రైతు కూలీలకు, కౌలు రైతులకు ఆర్థిక సహాయం ప్రభుత్వం పూర్తి విస్మరించిందని అన్నారు. 

అన్ని వర్గాలకు బీజేపీ మద్ధతు..
ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, విద్యారంగానికి సంబంధించిన అన్ని వర్గాలు కాంగ్రెస్​ కు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు నల్గొండ, వరంగల్​, ఖమ్మం సర్వోత్తం రెడ్డి, ఆదిలాబాద్​, కరీంనగర్​, నిజామాబాద్​ నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కొమురయ్యను గెలిపించాలని కోరారు.  పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అంజిరెడ్డి పోటీచేస్తున్నారని అన్నారు. శాసనమండలిలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు, నిరుద్యోగుల సమస్యలను లేవనెత్తి నెరవేరుస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల మేరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం బీజేపీ చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్ధతు ఇవ్వాలని కోరారు. 

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రానిదే పై చేయి..
రాష్​ర్ట ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టులు వారు ఏర్పాటు చేసుకుంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్​ర్టంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. జహీరాబాద్​ లో ఇండస్ర్టీయల్​ కారిడార్​, మెగాటెక్స్​ టైల్​ పార్కు వరంగల్​ కు, కాజీపేటలో కోచ్​ ఫ్యాక్టరీ, రూ. 7వేల కోట్లతో రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ, జాతీయ రహదారుల కోసం 1.20 లక్షల కోట్లను ఖర్చు చేశామని, మరో 80వేల కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకూ కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులతో తెలంగాణను అనసంధానించిందన్నారు. 84,490 కోట్ల రూపాయలతో రైల్వేల అభివృద్ధికి తెలంగాణకు కేంద్రం కేటాయించిందన్నారు. తెలంగాణ నుంచి ఐదు వందేభారత్​ లు ప్రయాణిస్తున్నాయన్నారు. మెట్రోకు రూ. 1200 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్​ సోలార్​ ప్రాజెక్టు వంద మెగావాట్ల ప్రాజెక్టు తెలంగాణకు తెచ్చామన్నారు. ఎరువులపై సబ్సిడీ రూ. 60వేల కోట్లన్నారు. కిసాన్​ సన్మాన్​ నిధి కింద ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. రాష్​ర్టంలో 11 ప్రాజెక్టులను చివరి వరకు కూడా పూర్తి చేయించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అన్నారు. అర్బన్​ ఏరియాల్లో అమృత్​ పథకం కింద రూ. 4వేల కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. గత పదేళ్లుగా గ్రామపంచాయితీలకు రోడ్లు, కార్మికులకు జీతాలు, స్వచ్ఛత, వీధి లైట్లు, కార్యాలయ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందన్నారు. స్మశానవాటికలు, రైతు వేదికలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మోదీదే అన్నారు. రూ. 1366 కోట్లతో ఎయిమ్స్​ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు.