రే‘వంతు’ హామీలు బూటకమే
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

తామిచ్చిన హామీలను నెరవేరుస్తాం
అప్పులపైనా ఏడుపులా?
స్టాలిన్ వి నిస్సిగ్గు మాటలే!
నా తెలంగాణ, హైదరాబాద్: వారిచ్చిన హామీలను తాము ఎలా నెరవేరుస్తామని, ఇంటింటికి స్వదస్తూరితో పోస్టులు పంపి మరీ ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలను నిసిగ్గుగా మోసం చేసే విధానాలకు తెరదీస్తున్నారని తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులు వందకు వంద శాతం పూర్తి చేస్తుందని అందులో ఏవైనా అనుమానాలు ఉంటే అడగాలని అన్నారు. అంతేగాని సోనియా, రాహుల్, రేవంత్ ఇచ్చిన హామీలతో తమకు సంబంధం ఏమిటని నిలదీశారు. కోచ్ ఫ్యాక్టరీపై అసత్యాలు, అప్పులపై ఏడుపులు, హామీలపై దాటవేత ధోరణి, భాషపై అబద్ధాలు ఇదే ఈ పార్టీల, వ్యక్తుల అసలైన విధానమని కిషన్ రెడ్డి విమర్శించారు.
అప్పుందని తెలియదా?..
తెలంగాణకు ఉన్న అప్పులను చూసి తనకు తిండి కూడా ఒంటబట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలపై కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ హయాంలోనే రూ. 7.50 లక్షల కోట్ల అప్పు ఉందని పలు సందర్భాలలో స్వయానా సీఎం రేవంత్ రెడ్డియే తెలిపారని, ఇప్పుడేమో తనకు అప్పు ఇంతగా ఉందని తెలియదని అనడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, ప్రకటించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులు వారే నిర్వహించాలని కూడా తెలియదా? అని నిలదీశారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలపై విరుచుకుపడ్డారు.
ఒక్క ఎంపీ సీటు తగ్గదు..
తెలంగాణ ప్రయోజనాల గురించి చేతులెత్తేసిన సీఎం తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తమదని అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో గానీ, దక్షిణ భారతదేశంలో గానీ ఒక్క సీటు కూడా తగ్గదని అన్నారు. తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంట్ సీట్లు తగ్గబోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయానా ప్రధాని మోదీ లోక్ సభలో చెప్పారని అన్నారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గే అంశంపై స్టాలిన్, రేవంత్ రెడ్డిలు మాట్లాడుతున్నవన్నీ బోగస్ మాటలేనని అన్నారు. జనాభా సేకరణ, రీ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు, అనంతరం గైడ్ లైన్స్ విడుదలవుతాయన్నారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు రానుండడంతో చెప్పుకోవడానికి ఏమీ లేదనందున తమిళనాడును దోచుకున్న స్టాలిన్ కుటుంబం ఓట్ల కోసం అసత్య వాదనలను తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పుకోవాల్సింది పోయి, హిందీ భాషకు రంగులు వేయాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళభాషకు పెద్ద పీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమిళ కాశీ, గుజరాత్, తెలుగు తమిళ సంఘాన్ని ఏర్పాటు చేశారని, తమిళభాషపై అనేక రీసెర్చ్ లు జరుగుతున్నాయని అన్నారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చే చర్యలు చేపట్టిన తొలి ప్రభుత్వం, 76 ఏళ్ల తరువాత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనన్నారు. హిందీ నేర్చుకోవాలని ఏ ఒక్కరినీ బలవంత పెట్టలేదని అన్నారు.
త్రిభాష సిద్ధాంతం కొత్తది కాదు..
త్రిభాష సిద్ధాంతం కొత్తది కాదని, కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే కొనసాగుతుందని అన్నారు. ఇంత అధ్వాన్నంగా దివాళా కోరు రాజకీయాలు చేయడం దేశానికి, ప్రజలకు ఏ మాత్రం మేలు చేయదని విమర్శించారు. ‘అడిగే వాడికి చెప్పేవాడు లొకువ’ అన్నట్లుగా ఈ పార్టీలు, వ్యక్తుల విధానాలు ఉన్నాయని మండిపడ్డారు. తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించే సమయంలో ఒక్కరోజు ముందు రాత్రికి సమాచారం అందజేస్తే ఎలా ఆ సమావేశానికి హాజరవుతామని ప్రశ్నించారు. ఎంపీలంతా వారి వారి నియోజకవర్గాల్లో అప్పటికే పలు కార్యక్రమాలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంపీల సమావేశానికి హాజరు కాలేదన్నారు. అదే అంశాన్ని తాను ప్రకటన ద్వారా ప్రభుత్వానికి తెలియజేశానని అన్నారు.
రెండు ఎన్నికల్లో సత్తా చాటారు..
ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వారు పూర్తి చేయకుండా తమను పూర్తి చేయమంటే ఎలాగని నిలదీశారు. హామీలను నెరవేర్చడంపై ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. ఇందులో న్యాయం ఎక్కడుందో? చెప్పాలని అన్నారు. తామిచ్చిన హామీలు పూర్తి చేయకుంటే అడగాలని అన్నారు. పసుపుబోర్డు హామీ ఇచ్చామని పూర్తి చేశామని అన్నారు. సోనియా, రాహుల్, తన సంతకాలతో ఇంటింటికి హామీల పత్రాలను పంపిణీ చేశారని ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం నిసిగ్గుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ప్రజల సత్తా ఏమిటో రుచి చూపించారని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి కొంతభూమిని రాష్ర్ట ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని, పనులు చకచకా జరుగుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రొడక్షన్ ప్రారంభిస్తామన్నారు. మంత్రులు వస్తానంటే ‘వందేభారత్’ రైలులో తీసుకువెళతానని, ఒపిక లేకుంటే తన సోషల్ ఖాతానైనా సందర్శిస్తే పనులు జరుగుతున్న తీరు దర్శనం ఇస్తుందని, చిత్రాలు కనిపిస్తాయని అన్నారు. ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజల ముందు మరింత దిగజారుతారని ఎద్దేవా చేశారు.
ఎంఎంటీఎస్ పై చేతులెత్తేశారు..
రిజినల్ రింగ్ రోడ్డుకు కూడా కేవలం రూ. 100 కోట్లు మాత్రమే డిపాజిట్ చేశారని, తమ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చేతులెత్తేశారని, అయినా పనులు ఆగవద్దని తాను కేంద్రాన్ని కోరానని చెప్పారు. తానింతవరకూ ఈ విషయం బయట పెట్టలేదన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానని అన్నారు. ఎంఎంటిఎస్ కు రాష్ర్ట ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించలేక రెండేళ్లు ప్రాజెక్టు మూలన పడితే తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టు ప్రారంభించేలా చొరవ తీసుకున్నానని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఆ నిధులు అందలేదని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా తాము ఏ మాత్రం వెనక్కు జరగబోమన్నది ఈ విషయాలతో ఋజువవుతుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.