అగ్నిప్రమాదంలో 51 మంది మృతి
100మందికి గాయాలు

స్కోప్జే: ఉత్తర మాసిడోనియా నైట్ క్లబ్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 51 మంది మృతి చెందగా, వందమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కొకానిలో జరిగిన పాప్ కచేరిలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని మాసిడోనియా మంత్రి హ్రిస్టిజన్ మికోవ్క్సీ ప్రకటించారు. నైట్ క్లబ్ లో పాప్ కచేరి సందర్భంగా భారీ ఎత్తున బాణా సంచా పేల్చడంతో ఈ క్లబ్ అంతా క్షణాల్లో మంటల్లో చిక్కుకుపోయిందని, దీంతో పాల్గొన్న వారికి తప్పించుకునేందుకు, శ్వాస తీసుకునేందుకు కూడా కష్టతరంగా మారిందన్నారు. క్లబ్ మొత్తం భారీ పొగ నిండిపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. సహాయక చర్యల వేగవంతంతో మంటలు పూర్తిగా ఆర్పగలిగామని, క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్చి చికిత్సనందింప చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రుల ముందు భారీ ఎత్తున మృతులు, చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు భారీ ఎత్తున చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కచేరికి దాదాపు 1500మంది హాజరయ్యారు.